GST Rates Hike: అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ రేట్లు..వీటి పై బాదుడే బాదుడు..!
New GST Rates: కేంద్ర ప్రభుత్వం ఆదాయం కోసం కొత్త దారులు వెతుకుతూనే ఉంది. కంటికి కనిపించే ఏ వస్తువును వదిలిపెట్టడం లేదు. కొన్ని వస్తువులకు కొత్తగా రేట్ల వర్తింపజేయగా..మరికొన్ని వస్తువులను వేరే స్లాబ్ రేటులోకి మార్చారు. దీంతో వాటి ధరలు పెరగనున్నాయి.కొత్త జీఎస్టీ ధరలు ఈరోజు నుంచి అమలులోకి వచ్చాయి.పెరుగు నుంచి పెన్సిల్ చెక్కుకునే షార్ప్నర్ల దాకా అన్నింటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. హోటల్ రూంలు, ఆస్పత్రుల్లోని ఐసీయూలపైనా జీఎస్టీ విధించింది.
ఆదాయార్జనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ప్యాక్ చేసిన లేబుల్డ్ వస్తువులపై జీఎస్టీ వసూలు చేస్తోంది. గోధుమపిండి, అప్పడాలు, పన్నీర్, పెరుగు, మజ్జిగ, లస్సీ, మాంసంపైనా 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. టెట్రా ప్యాక్‌లపై 12 నుంచి 18 శాతానికి పెంచారు. చేపలు, తేనె, ఎండు చిక్కుళ్లు, గోధుమలు, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్‌పై 5 శాతం జీఎస్టీ విధించింది. ప్యాక్ చేయని, లేబుల్ వేయని, అన్‌బ్రాండెడ్ ఉత్పత్తులకు మాత్రం జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుంది.
ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్‌లపై పన్నును 18 శాతానికి పెంచింది. కత్తులు, కటింగ్ బ్లేడ్లు, పేపర్ కత్తులు, పెన్సిల్ చెక్కుకునే షార్ప్నర్లపైనా 18% పన్ను చెల్లించాల్సిందే. మ్యాప్‌లు, ఛార్టులు, అట్లాస్‌పై 12% పన్ను పడుతుంది. వెయ్యి రూపాయలలోపు గది తీసుకున్న వారంతా 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. ఇప్పటి వరకు వెయ్యికన్నా ఎక్కువ విలువైన హోటల్ గదులపైనే జీఎస్టీ వర్తించేది. ఆసుపత్రిలో ఒక రోగి 5వేల కంటే ఎక్కువ అద్దె గది తీసుకుంటే…ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కట్ అండ్ పాలిష్డ్ వజ్రాలపై 0.25 నుంచి 1.5 శాతానికి పెంచారు.
ఎల్ఈడీ లైట్లు, మెటల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులపై 18 శాతం, సోలార్ వాటర్ హీటర్‌పై 12 శాతం పన్ను విధించింది. చెప్పులు, తోలు ఉత్పత్తుల తయారీ జాబ్‌వర్క్‌లపై 12 శాతానికి పెరిగింది. రోడ్లు, వంతెనలు, రైల్వేలు, మెట్రో, శుద్ధి ప్లాంట్లు, శ్మశానవాటికల కాంట్రాక్టు వర్కులపై 18 శాతం పన్నులు వసూలు చేస్తోంది. చెక్కులు జారీ చేసినందుకు బ్యాంకులు వసూలు చేసే ఛార్జీపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.