Chanda Kochar: చందాకొచ్చర్‌కు బెయిల్ మంజూరు చేసిన బోంబే హైకోర్టు
ICICI Ex CEO Chanda Kochar gets bail
ICICI బ్యాంక్ మాజీ సీఈఓ చందాకొచ్చర్‌కు బెయిల్ లభించింది. ఆమెతో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు కూడా బోంబే హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. వీరిద్దరినీ చట్ట విరుద్ధంగా అరెస్టు చేశారని కోర్టు మండిపడింది. సెక్షన్ 41ఏ ప్రకారం వీరి అరెస్టు జరగలేదని బోంబే హైకోర్టు తెలిపింది.
లోన్ ఫ్రాడ్‌లో కేసులో గత ఏడాది డిసెంబర్ 23న వీరిద్దరూ అరెస్టయ్యారు. చందాకొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగం చేశారు. ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారు. వీడియోకాన్ గ్రూప్ సంస్థకు 3 వేల కోట్ల రూపాయల లోన్ మంజూరు చేశారు. ఆ క్రమంలో జరిగిన అవకతవకలపై కొంత కాలంగా దర్యాప్తు జరుగుతున్న పోలీసులు వారిద్దిరినీ కొన్ని రోజుల క్రితం అరెస్టు చేశారు.
వీడియోకాన్ సంస్థకు లోన్ ఇవ్వడం ద్వారా చందాకొచ్చర్‌కి, ఆమె కుటుంబ సభ్యులకు ఆర్ధికంగా మేలు జరిగినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో ICICI బ్యాంక్ సీఈఓ, ఎండీగా ఉన్న చందాకొచ్చర్ 2018లో తన పదవులనుంచి వైదొలిగారు.
3 వేల కోట్ల రూపాయల లోన్ NPగా మారడంతో చందాకొచ్చర్ అవినీతి అంశం వెలుగులోకి వచ్చింది. బ్యాంకింగ్ రంగంలో అప్పటి వరకు ఓ వెలుగు వెలిగిన చందాకొచ్చర్ పాపులారిటీ అమాంతంగా తగ్గిపోయింది. ఆమె ప్రతిష్ట మసకబారింది. చట్టం నుంచి తప్పించుకోలేకపోయింది. ప్రస్తుతం కోర్టుల చూట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.