Google cutoff 12000 jobs: గూగుల్ భారీ షాక్… ఆరు శాతం ఉద్యోగుల తొలగింపుకు సిద్ధం
Google cutoff 12000 jobs: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సంస్థ నుండి ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్ధం అయింది. ఈ విషయాన్ని గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ తెలియజేసింది. గూగుల్ సంస్థ నుండి 12000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇప్పటికే ఆయన తొలగింపుకు సంబంధించి మెయిల్స్‌కూడా పంపినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ నుండి ఆరుశాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవడం బాధాకరమైన విషయమే అయినప్పటికీ తప్పడం లేదని, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్భణం పెరుగుదల కారణంగా భారం తగ్గించుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గూగుల్ చరిత్రలో ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారని అన్నారు. ఈ ఏడాది గూగుల్ సంస్థ తమ లాభాలు 27 శాతం మేర క్షీణించాయి. ఆదాయం 13.9 బిలియన్ డాలర్లకు చేరింది. లాభాలు, ఆదాయం క్షీణించడంతో కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నది. కాగా, మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పటికే 10వేల మంది ఉద్యోగులను తొలగించింది. అటు అమెజాన్, ట్విట్టర్ వంటి సంస్థలు సైతం భారం తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ బాటలో గూగుల్ కూడా చేరింది. మరికొన్ని దిగ్గజ కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.