Gold Price in Hyderabad: రికార్డు స్థాయిలో బంగారం ధరలు
Gold Price in Hyderabad: దేశంలో అత్యధికంగా వినియోగించే వాటిల్లో బంగారం కూడా ఒకటి. గత కొంతకాలంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బంగారం ధర 57 వేల మార్క్ ను దాటింది. ఎప్పుడూ లేనంతగా బంగారం ధరలు పెరిగిపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆల్‌టైమ్ గరిష్టానికి ధరలు చేరుకున్నాయి. కోల్‌కతాలో 10 గ్రాముల బంగారం ధర రూ. 57,500కి చేరింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో బంగారం ఉత్పత్తి తగ్గిపోవడమే ఇందుకు కారణమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
దక్షిణాఫ్రికాలో బంగారం ఉత్పత్తి 10.4 శాతం మేర తగ్గిపోయింది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉండటంతో వివిధ దేశాలకు చెందిన కేంద్రీయ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకునేందుకు ఆసక్తి చూపడం కూడా బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెబుతున్నారు. 2022లో వివిధ దేశాలకు చెందిన కేంద్రీయ బ్యాంకులు 440 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నాయి. డాలర్ ధర కూడా పడిపోతుండటం బంగారం పెరుగుదలకు ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 56,950 ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,200గా ఉన్నది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.