Gold Price Hike: డాలర్ పతనంతో రెక్కలు తొడిగిన పసిడి
Gold Price Hike: కరోనా సమయంలో పుత్తడి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఆ తరువాత కోలుకోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే, ప్రస్తుతం ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఆర్థిక మాంద్యం దెబ్బకు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో డాలర్ మారకం విలువ భారీగా పతనం అయింది. మాంద్యం దెబ్బకు బ్యాంకులు సైతం చేతులెత్తేస్తున్నాయి. ఇటీవలే అమెరికాకు చెందిన ప్రముఖ బ్యాంకులు సిలికాన్ వ్యాలీ, సిగ్నేచర్ బ్యాంకులు మూతపడటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సేఫ్ జోన్‌లో ఉంచుకోవాలని చూస్తున్నారు. దీనికి బంగారంపై పెట్టుబడులు పెడితే ఇలాంటి ఇబ్బందులు ఉండవని గ్రహించిన పెట్టుబడిదారులు అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
దీనికితోడు పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని కంట్రోల్ చేసేందుకు ఫెడ్ రేట్లు పెంచడంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టడం వలన ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో బులియన్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 970 పెరిగి రూ. 56,550 కి చేరింది. వెండి ధరలు సైతం భారీగా పెరిగాయి. బంగారం ధరలు కొండెక్కడంతో సాధారణ వినియోగదారుడు ఆందోళన చెందుతున్నాడు. భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.