Gautam Adani on Education System: గౌతమ్ అదానీ పశ్చాత్తాపం… ఆ విద్య పూర్తి చేసి ఉంటే
Gautam Adani on Education System: ప్రముఖ వ్యాపారవేత్త, భారత కుబేరుడు గౌతమ్ అదానీ గుజరాత్‌లోని పాలన్పూర్ విద్యామందిర్ ట్రస్ట్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విద్య యొక్క ప్రాముఖ్యతను, విద్యను అభ్యసించడం వలన కలిగే ఉపయోగాలను విద్యార్థులతో పంచుకున్నారు. అయితే, తాను ఓ విషయంలో ఇప్పటికీ బాధపడుతున్నానని అన్నారు. తాను కళాశాల చదువును పూర్తిచేయలేకపోయాననే అసంతృప్తి ఇప్పటికీ తనను వేధిస్తోందని అన్నారు. జీవితంలోని అనుభవాలు పాఠాలను నేర్పినప్పటికీ, విద్యతోనే పంపూర్ణజ్ఞానం లభిస్తుందని అన్నారు. చదువు జీవితానికి అర్ధం ఇస్తుందని అన్నారు.
ప్రతి విద్యార్ధి చక్కగా చదువుకోవాలని, చదువే జీవితానికి మార్గదర్శకం అవుతుందని అన్నారు. పాలన్పూర్ విద్యామందిర్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ వేడుకలకు గౌతమ్ అదానీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విద్యారంగంలో వస్తున్న మార్పులపై కూడా ఆయన విద్యార్ధులతో ముచ్చటించారు. మార్పులకు అనుగుణంగా విద్యను అభ్యసించాల్సి ఉంటుందని, కాంపిటీషన్ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే విద్య తప్పనిసరి అని అన్నారు. విద్య లేకుండా విజయాలు సాధించడం చాలా కష్టం అవుతుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలని అన్నారు.