Poonam Gupta: చెత్త పేపర్ల వ్యాపారం, స్కాట్లాండ్ లో విజయవంతం
Delhi’s Poonam Gupta set up Business Empire in Scotland
ఢిల్లీకి చెందిన పూనమ్ గుప్తా అరుదైన ఘనత సాధించారు. దేశం కాని దేశంలో భారత జెండాను రెపరెపలాడించారు. ఊహించని విధంగా వ్యాపారం రంగంలో ప్రవేశించి అనూహ్య విజయం సాధించారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఇటీవలే భారతదేశానికి వచ్చిన ఆమె తన విజయం గురించి అందరితో పంచుకున్నారు. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ప్రవాసీ దివస్ లో పూనమ్ గుప్తా పాల్గొన్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ముచ్చటించారు.
ఢిల్లీకి చెందిన పూనమ్ గుప్తా లేడీ శ్రీరాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేశారు. 2002లో పునీత్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. తన భర్త మెడికల్ రంగంలో స్థిరపడిన వ్యాపారి. స్కాట్లాండ్ లో నివాసం. దీంతో పూనమ్ కూడా భర్తతో పాటు స్కాట్లాండ్ చేరుకున్నారు. మొదట్లో ఏదో ఒక ఉద్యోగం చేయాలని భావించారు. అందులో విజయవంతం కాలేకపోయారు. సరైన ఉద్యోగం దొరకలేదు.
కొత్తగా ఏదో ఒకటి చేయాలని ఆలోచించడం ప్రారంభించారు. కొంత కాలం పాటు రీసెర్చ్ చేశారు. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో స్క్రాప్ పేపర్లపై ఆమె దృష్టి పడింది. ఎంతో క్వాలిటీ కలిగిన ఆ పేపర్లను చెత్తగా పారేస్తున్న విషయాన్ని గ్రహించారు. వాటిని రీ సైకిల్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఆమెకు కలిగింది. అక్కడి నుంచి ఒక్కో అడుగు ముందుకు వేశారు.
చెత్తగా భావించబడే క్వాలిటీ పేపర్లను ఎలా అమ్మాలో అని ఆలోచించడం మొదలు పెట్టారు. ఒక ఇటలీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే 40 లక్షల రూపాయల డీల్ కుదిరింది. చెత్తగా భావించబడే క్వాలిటీ పేపర్లను రీ సైకిల్ చేసి అమ్మడం ప్రారంభించారు.
ఈ క్రమంలో తానే సొంతంగా స్కాట్లండ్ లో పీజీ పేపర్ అనే పేరుతో ఓ కంపెనీ 2004లో ప్రారంభించారు. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ఇటలీ, ఫిన్లాండ్, అమెరికాలలో అనేక ప్రాంతాల నుంచి స్క్రాప్ పేపర్లు కొనడం ప్రారంభించారు. వాటిని రీ సైకిల్ చేసి తిరిగి అమ్మడం ద్వారా తన వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో నడిపించారు.
క్రమ క్రమంగా వ్యాపారం అనేక దేశాలకు విస్తరించింది. దీంతో పూనమ్ గుప్తా ఇతర రంగాలలో కూడా ప్రవేశించారు. ప్రస్తుతం ఆమె 9 కంపెనీలను నడుపుతున్నారు. రూ.1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా నిర్వహిస్తున్నారు. 60 దేశాలలో తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
భారతీయులు పాత వస్తువులను అంత త్వరగా వదులుకోరని, అదే తనకు స్పూర్తిగా నిలిచిందని తెలిపారు. భారతదేశంలో స్క్రాప్ పేపర్లతో తయారైన పేపర్లు ఎంతో క్వాలిటితో ఉంటాయని, వేరే దేశాల్లో అలా ఉండదని తాను గుర్తించానని, అదే తన వ్యాపారానికి పునాది అని తెలిపారు.