Akasa Air: ‘ఆకాశం’లో తొలి అడుగు
Akasa Airlines got first order from Boeing: ఆకాశ ఎయిర్ లైన్స్ జర్నీలో తొలి అడుగు పడింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి మొదటి విమానాన్ని పొందింది. 737 మ్యాక్స్ మోడల్ ఫ్లైట్ ఢిల్లీకి చేరుకుందని ఆకాశ ఎయిర్ లైన్స్ సంతోషంగా ప్రకటించింది. పోయిన వారమే ఈ ఫ్లైట్‌ని బోయింగ్ నుంచి తీసుకున్నామని తెలిపింది. తమ సంస్థ కార్యకలాపాల ప్రారంభానికి ఇది తప్పనిసరని పేర్కొంది. తమ సొంత విమానం ఇండియాకి రావటం ఆనందంగా ఉందని ఆకాశ ఎయిర్ లైన్స్ సీఈఓ, ఎండీ వినయ్ దూబే అన్నారు.
ఆకాశ ఎయిర్ లైన్స్ వాణిజ్య కార్యకలాపాల కోసం 2021 ఆగస్టులో పౌర విమానయాన శాఖ నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’(ఎన్ఓసీ) పొందింది. అనంతరం గత నవంబర్ లో బోయింగ్ తో విమానాల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ నుంచి 72 మ్యాక్స్ మోడల్ ఫ్లైట్లు కొననుంది. ఒప్పందంలో భాగంగా తొలి విమానాన్ని లేటెస్టుగా సొంతంగా చేసుకున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి 18 విమానాలను, తర్వాత నాలుగేళ్లలో 54 విమానాలను తీసుకోనుంది.
ఆకాశ ఎయిర్ లైన్స్ తో ఒప్పందం చేసుకోవటం తమకు గర్వకారణమని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే చెప్పారు. విమాన ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆకాశ ఎయిర్ లైన్స్ ని ఫేమస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా ప్రారంభించిన సంగతి తెలిసిందే.