Hyderabad : త్వరలో 300 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
హైదరాబాద్ లో త్వరలో 300 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు స్టేషన్లు రాబోతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో నగరంలో 300 పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. వాటిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిమితులు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSREDCO) అధికారి మాట్లాడుతూ “ఛార్జింగ్ ఖర్చు గంటకు రూ.18 కిలోవాట్ (kWh)గా నిర్ణయించారు. అయితే ధరలు మారే అవకాశం ఉంది” అని తెలిపారు. ఇందిరా పార్క్, కేబీఆర్ పార్క్ గేట్ 1, ఒవైసీ హాస్పిటల్ సమీపంలోని సంతోష్ నగర్, ఉప్పల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతం వంటి అనేక ప్రదేశాలలో ఈ EV ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. GHMC అధికార పరిధిలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను త్వరలో GHMC స్టాండింగ్ కమిటీ ముందు ఉంచుతామని ఓ GHMC అధికారి తెలిపారు. ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. అవసరం ఎక్కువగా ఉన్న చోట సంఖ్యను పెంచే అవకాశం ఉంది. GHMC, TSREDCO మధ్య ఈ విషయంపై చర్చలు జరిగాక, EV ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు జరుగుతుంది. ఇక ప్రస్తుతం నగరంలో దాదాపు 150 EV ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, పెట్రోల్ బంక్‌లు మొదలైన వాటికి సమీపంలో ఏర్పాటు చేశారు. TSREDCO ద్వారా రాష్ట్రంలో ఛార్జింగ్ స్టేషన్‌ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీ ఎలక్ట్రిక్ వాహనాల స్థాయిని పెంచేందుకు వీలు కల్పిస్తోంది.