YSRCP Plenary: ఐదేళ్ల తర్వాత వైసీపీ ప్లీనరీ..పార్టీ నిర్మాణంలో కీలక మార్పులకు చాన్స్
వచ్చే నెల 8,9తేదీల్లో జరుగనున్న ప్లీనరీకి వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది. వివిధ అంశాల పై కమిటీలను ఏర్పాటు చేశారు. వేదిక డిజైనింగ్, ఆర్ధిక వ్యవహారాలు, సమన్వయ కమిటి, సభ నిర్వహణ కమిటి వంటి పలు కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ కమిటీల నేతృత్వంలో ఆయా పనులపై కసరత్తు జరుగుతోంది. ఐదేళ్ళ తర్వాత జరుగుతున్న ఈ ప్లీనరీని ఘనంగా చేపట్టాలనే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉంది. పార్టీ నిర్మాణంలో కొన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటి స్థానంలో కోర్ కమిటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది.
పార్టీకి సంబంధించిన పాలసీ నిర్ణయాల్లో ఈ కమిటీది అత్యున్నత పాత్ర ఉండనుంది. కోర్ కమిటిలో గరిష్టంగా 15 మంది సభ్యులు ఉంటారు. దీని తర్వాత సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ పేరుతో సీనియర్లతో మరో కమిటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కమిటీల్లో సీనియర్ నేతలు, ముఖ్య నేతలకు చోటు ఉంటుంది. అయితే ఈ రెండు కమిటీలకు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నా పార్టీ అధ్యక్షుడిదే తుది నిర్ణయం అవుతుంది.
ఇక మరోవైపు ప్లీనరీలో చేసే తీర్మానాల పై కూడా కసరత్తు జరుగుతోంది. మొత్తం 12 నుంచి 15 తీర్మానాలు ఉండే అవకాశం ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనకు ప్రజల ముంగిటకు తీసుకుని వెళ్ళటం, ఆర్బీకేల ఏర్పాటు, ముఖ్యమంత్రి నేతృత్వంలో దావోస్ పర్యటన, బీసీలకు పెద్ద పీట వేయటం, గిరిజనులు, మైనార్టీ వర్గాల కోసం ప్రభుత్వం చేస్తున్న లబ్ది, జిల్లాల విభజన, మహిళల ఆర్ధిక, రాజకీయ సాధికారత కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, జగనన్న కాలనీల ఏర్పాటు వంటి కీలకమైన అంశాల పై చర్చ జరుగనున్నట్లు సమాచారం. ప్లీనరీ ప్రారంభ, ముగింపు ఉపన్యాసాలు పార్టీ అధ్యక్షుడిగా జగన్ చేయనున్నారు. ఇవే కాకుండా పార్టీ బైలాస్‌కు సంబంధించిన కొన్ని సవరణలు చేయనున్నట్లు తెలుస్తుంది.