YSRCP Kapu Leaders New Task: వైసీపీ మంత్రులు కాపు కాస్తారా
YSRCP Kapu Leaders New Task: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది సమీకరణాలు మారుతున్నాయి. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను తమవైపుకు తిప్పుకున్నది. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. 2019లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. దీంతో కాపు ఓట్లలో చీలిక ఏర్పడింది. అది వైసీపీకి లాభం చేకూరింది. వైసీపీలో ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు బొత్సా సత్యన్నారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ తోపాటు పలువురు మాజీ మంత్రులు కూడా ఉన్నారు. వీరికి అధికార వైసీపీ కీలక టార్గెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాపు నేతలు, ఓటర్లు తమవైపే ఉండేలా చూడాలని వీరిపై ఒత్తిడి తీసుకొస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
దీనికి కారణం లేకపోలేదు. 2024 ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు పొత్తులు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు భేటీ అయ్యారు. ఈ భేటీ తరువాత రాజకీయాల్లో అనూహ్యంగా వేడి రగులుకున్నది. బాబు, పవన్ కలిసి పోటీ చేస్తే కాపు ఓటర్లలో ఎక్కువ భాగం వీరివైపే మొగ్గు చూపుతారు. అదే జరిగితే వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. అధికార కోల్పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే నిధుల కొరతను ఎదుర్కొంటున్నది. ఎక్కడ అభివృద్ధి అక్కడే నిలిచిపోయింది. పైగా కొత్తగా మూడు రాజధానుల అంశం తెరమీదకు రావడంతో మరిన్ని విమర్శలు ఎదుర్కొంటున్నది.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలవడంతో కొత్త సమీకరణాలు తెరమీదకు వచ్చాయి. అంతేకాదు, ఆర్థికంగా వెనుకబడిన కోటా కింద కాపులకు రిజర్వేషన్లను తిరస్కరించడం, నామినేటెడ్ పదవుల్లోనూ వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కాపులు జగన్ ప్రభుత్వంపై కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అసంతృప్తి ఎన్నికల వరకు కొనసాగితే కాపులంతా గంపగుత్తుగా టీడీపీ, జనసేన పార్టీ వైపుకు మొగ్గుచూపుతారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ అధినేత జగన్ కాపు మంత్రలకు కొత్త టాస్క్‌ను ఇచ్చారు. కాపు నేతలు, కాపు ఓటర్లు వైసీపీవైపే ఉండేలా చర్యలు తీసుకోవాలని, వారిని ఒప్పించాలని ఆదేశించారు.
ఇప్పుడు కాపు మంత్రుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా మారింది. రిజర్వేషన్లు తిరస్కరించారనే ఆగ్రహంలో ఉన్న కాపు ఓటర్లను ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియక మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. పవన్, చంద్రబాబును తమదైన శైలిలో విమర్శిస్తూనే, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కాపు ఓటర్లు జారిపోకుండా కాపుకాయాలని మంత్రులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
ఏపీలో ఎన్నికలకు ఇంకా కేవలం ఒకటిన్న సంవత్సరాల సమయం మాత్రమే ఉన్నది. ఈ లోగా కాపు సంక్షేమం కోసం కొత్త పథకాలను తీసుకొచ్చి వారికి లబ్ది చేకూర్చడంతో పాటుగా, కాపు రిజర్వేషన్లకు హామీలు ఇవ్వడం, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటివి చేయడం ద్వారా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంటుంది. అయితే, కాపు సామాజిక వర్గానికి ప్రత్యేకంగా అవకాశాలు కల్పిస్తే మిగతా సామాజిక వర్గాల నుండి కొంతమేర ఒత్తిడి ఎదురయ్యే అకవాశం కూడా ఉంటుంది.