Viveka murder Case: సీబీఐ ముందుకు నేడు వైఎస్ భాస్కర్‌రెడ్డి
Viveka murder Case: ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకోమలుపుతిరుగుతుంది. వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంతో ఆరవ తేదీ విచారణకు హజరు కాలేనంటూ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ఈ మేరకు సీబీఐ అధికారికి మెయిల్ పంపారు. కాగా నేడు సీబీఐ విచారణకు భాస్కర్‌రెడ్డి హాజరుకానున్నారు.
ఇప్పటికే మూడుసార్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ.. ఇప్పుడు ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. నేడు సీబీఐ బృందం భాస్కర్‌రెడ్డిని కడపలో విచారించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వివేకా హత్య జరగడానికి ముందురోజు అంటే 2019 మార్చి 14వ తేదీ సాయంత్రం అవినాశ్‌రెడ్డి ఇంట్లో ఈ కేసులో ఏ-2గా ఉన్న సునీల్ యాదవ్ ఉన్నట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. హత్య కేసులో సాక్ష్యాధారాల చెరిపివేత, రూ.40 కోట్ల డీల్‌లో భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిల ప్రమేయం ఉన్నట్లు సీబీఐ వాదిస్తోంది. మరి నేడు భాస్కరరెడ్డిని విచారణకు హాజరవుతుండడంతో ఎం జరుగుతుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.