Ys Jagan: కోనసీమ జిల్లాలో జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే!
Ys Jagan Tour Schedule at Konaseema District: తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే గోదావరి జిల్లాలలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటించారు. ఇక తాజాగా సీఎం వైఎస్ జగన్ మంగళవారం కోనసీమ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. మంగళవారం అంటే రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు పి. గన్నవరం మండలం జి. పెదపూడి గ్రామానికి చేరుకోనున్నారు.
ఇక 11 గంటలకు జి. పెదపూడి పుచ్చకాయల వారి పేటలో వరద బాధితులతో సమావేశం కానున్నారు. తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలవనున్నారు. అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశం కానున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2. 05 గంటలకు పి. గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకోనున్న సీఎం జగన్ అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుంటారు.
అక్కడ వరద బాధితులతో సమావేశం అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి వెళ్లనున్నారు. అక్కడి ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద ప్రభావం అనంతరం తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం రాత్రికి అక్కడే బస చేయనున్న సీఎం జగన్ తరువాత రోజు కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలోనే పర్యటించే అవకాశం ఉంది. ఇక జగన్ పర్యటించనున్న గ్రామాల్లో ప్రజలు ఏమి మాట్లాడాలో మంత్రులు ట్రైనింగ్ ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.