Nara Lokesh: వైఎస్ జగన్ హత్యా రాజకీయాలకు తెరలేపారు: నారా లోకేష్
Nara Lokesh Fire on CM Jagan: ఏపీలోని పల్నాడు జిల్లా రొపించర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. హత్యలు, దాడులతో సీఎం జగన్ టీడీపీని బయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. శిశుపాలుడిలా జగన్ పాపాలు పండిపోతాయన్నారు. ప్రజా వ్యతిరేకత తీవ్రం కావడంతో రాజకీయ ఆధిపత్యం కోసం వైసీపీ చేస్తోన్న హత్యలు, దాడులే జగన్ పతనానికి దారులు తీస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఈ దాడిలో వైసీపీ ఎంపీపీ భర్త పాల్గొన్నాడన్న లోకేష్.. జగన్ రౌడీమూకలు ఎంతగా బరితెగించాయో అర్థమవుతోందన్నారు. ఫ్యాక్షన్ మనస్తత్వం బ్లడ్‌లోనే ఉన్న రౌడీ పాలనలో పల్నాడు ప్రాంతం రక్తసిక్తమవుతోందని.. ఇకనైనా హత్యారాజకీయాలు, దాడులను ఆపాలని.. లేకపోతే ఇంతకు నాలుగింతలు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పోలీసులు అండగా ఉన్నారని రెచ్చిపోతున్న వైసీపీ నేతలకు ఇదే చివరి హెచ్చరికని లోకేష్ స్పష్టం చేశారు.రౌడీ మూకల పాలనకు చరమగీతం పాడే సమయం దగ్గర్లోనే ఉందన్నారు.