Ys Jagan: 8న పార్టీ నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం
Ys Jagan Crucial Meeting on December 8th: ఈ నెల 8న పార్టీ నేతలతో ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, కొత్తగా నియమించిన అబ్జర్వర్లతో జగన్ 8న భేటీ కానున్నారు. రానున్న ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా నాయకులకు జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈసారి రాబోవు ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఆ నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో జగన్ విడివిడిగా సమావేశం అవుతూ వస్తున్నారు. ఇప్పటికే అద్దంకి, కర్నూలు జిల్లా ఆలూరు, విశాఖ నార్త్ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఇక ఈ సమావేశం తర్వాత జిల్లా అధ్యక్యులుగా రాజీనామా చేసిన వారి స్థానంలో కొత్త వారిని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.