YCP Target: లోకేష్ పాదయాత్ర మొదలయితే… వైసీపీ టార్గెట్ అదేనా?
YCP Target: ఒకపక్క తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27వ తేదీ ఆయన పాదయాత్ర ప్రారంభం కాబోతూ ఉండగా ఈరోజు హైదరాబాదులో ఆయన కుటుంబ సభ్యులందరి దగ్గర కలుసుకొని వారందరి ఆశీస్సులు తీసుకున్నారు. 27వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి నుంచి పెద్ద ఎత్తున పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు లోకేష్. దాదాపు 400 రోజుల పాటు అంటే ఏడాది రెండు నెలలపాటు ఈ పాదయాత్ర ఘనంగా ప్లాన్ చేసింది టీడీపీ. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి నుంచి ఎన్నికలు జరిగే వరకూ ఈ పాదయాత్రని లోకేష్ నిర్వహించబోతున్నారు.
4000 కిలోమీటర్ల దూరం ఆయన నడవబోతున్నారు. అయితే లోకేష్ పాదయాత్రను తెలుగుదేశం కార్యకర్తలు నేతలు మాత్రమే కాదు వైసీపీ కూడా నిశితంగా పరిశీలిస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీని బలపరిచే ఉద్దేశంతో లోకేష్ పాదయాత్రకు పూనుకుంటే వైసీపీ మాత్రం ఇదే అదునుగా భావించి తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్ ని మంగళగిరిలో బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి నారా లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 2024 ఎన్నికల్లో కచ్చితంగా అక్కడి నుంచి గెలిచి తీరాలని ఆయన పట్టుదలతో ఉన్నారు.
అయితే అక్కడ అంతకుముందు ఇన్చార్జిగా వ్యవహరిస్తూ ఉన్న గంజి చిరంజీవి మంగళగిరి స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించి బంగబడడంతో వైసీపీ ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరి ఆ పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2024 ఎన్నికల్లో గంజి చిరంజీవిని వైసీపీ అభ్యర్థిగా మంగళగిరి నుంచి పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డిని జగన్ సత్తెనపల్లికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని అంటున్నారు. మంగళగిరిలో రామకృష్ణారెడ్డి పై వ్యతిరేకత పెరుగుతూ ఉండటంతో పాటు ఆయన అభ్యర్థిగా ఉంటే గెలుపు కష్టమని సర్వే రిపోర్టులు చెప్పడంతోనే జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అంటున్నారు.
దీంతో ఆయనను సత్తెనపల్లికి పంపి గంజి చిరంజీవిని లోకేష్ కి ప్రత్యర్థిగా లోకల్ అనే నినాదంతో పోటీ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడి గెలుపోటములను నిర్దేశించేది చేనేత కార్మికులు కావడం ఈ నియోజకవర్గంలో పద్మశాలీల ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని పోటీలోకి దింపుతున్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో లోకేష్ ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ తో పాటు సంచార వైద్య వాహనాన్ని నియోజకవర్గం వ్యాప్తంగా తిప్పుతున్నారు. అయితే లోకేష్ 400 రోజులు పాటు బయట నియోజకవర్గాల్లోనే గడపాల్సి వస్తూ ఉండడంతో ఈలోపు టిడిపిని ఇక్కడ పూర్తిగా బలహీనపరిచి వైసిపి మరోసారి ఇక్కడ నుంచి గెలిచే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది ఇందులో ఎంతవరకు సఫలమవుతుందనేది కాలమే నిర్ణయించాలి.