YCP Leaders: వైసీపీ నుంచి టీడీపీకి కీలక నేతలు!
YCP Leaders to TDP: అమరావతి పై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోనే ఉన్నా కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్న ఆయన అమరావతికి చెందిన కొందరు రైతులు తనను కలవడంతో ఈ అంశం మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా ఖాజీపేటలో అమరావతి రైతులు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని కలసి అమరావతికి రాజధానిగా మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వం కోణంలో అమరావతి రాజధాని కాకపోయినా.. ప్రజలు మాత్రం అమరావతినే రాజధానిగా భావిస్తున్నారని సుప్రీంకు వెళ్లిన ప్రభుత్వానికి అక్కడ విజయం దక్కదని డీఎల్ వ్యాఖ్యలు చేశారు. మంత్రులు అమరావతి గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పేర్కొన్న ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని జోస్యం చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టులో అమరావతికి తీర్పు అనుకూలంగా వచ్చినా ప్రభుత్వం అమరావతి కోసం ఏం చేయదని అయినా త్వరలోనే ప్రజలకు మంచి రోజులు వస్తాయంటూ డీఎల్ కామెంట్ చేశారు. ఇక మరోపక్క వైసీపీ మునిగిపోయే నావ లాంటిదని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి జగన్ పాలనలో జనం విసిగిపోయారని, రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి పోయిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, మార్చిలో కమలాపురం నియోజకవర్గంలోని తన వర్గీయులతో సమావేశమై టీడీపీలో చేరుతామన్నారు. తనతో పాటు డీఎల్ రవీంద్రారెడ్డి కూడా టీడీపీలోకి వస్తారని ఆయన పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికిన వీరశివారెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో చేరిపోయినా పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యం దక్కడం లేదని భావించి చాలా కాలంగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.