Laxmi Parvathi: చంద్రబాబు మనసు, శరీరం కుళ్ళి పోయాయి-లక్ష్మీ పార్వతి
YCP leader Laxmi Parvathi comments on TDP
వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, చంద్రబాబు తనయుడు లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న కార్యక్రమాలను విమర్శిస్తూ లక్ష్మీ పార్వతి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తున్నాడని నారా లోకేశ్ పై విమర్శలు గుప్పించారు. ఫైబర్ నెట్ స్కామ్ లో దోపిడీకి పాల్పడ్డ వాడు నీతిమంతుడిగా ప్రజల ముందుకు వస్తున్నాడని అన్నారు. కేంద్రం సీరియస్ గా దృష్టి సారిస్తే యువ నాయకుడికి జైలు ఖాయమని అభిప్రాయపడ్డారు. సంస్కార హీనమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళను చూస్తే వాళ్ళ పుట్టుక సక్రమమైనదేనా అనే అనుమానం కలుగుతోందని అన్నారు.
గుంటూరులో తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు చనిపోయిన దుర్ఘటనపై కూడా లక్ష్మీ పార్వతి విమర్శలు గుప్పించారు. వంద రూపాయలు చీర, పుచ్చిపోయిన కందిపప్పు ఇస్తామని పిలిచి అమాయక మహిళల ప్రాణాలు తీశారని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు.
న్యాయ వ్యవస్థపై ఎదురు దాడి చేసే తప్పుడు సాంస్కృతికి ప్రధాన ప్రతిపక్షం తెరతీసిందని లక్ష్మీ పార్వతి విమర్శించారు. టీడీపీ నాయకులకు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబులో అస్సలు పశ్చాత్తాపం లేదని లక్ష్మీ పార్వతి విమర్శించారు. అన్ స్థాపబుల్ కార్యక్రమంలో హంతకులు ఇద్దరు ఒకరిని ఒకరు సమర్ధించుకున్నట్టు అనిపించిందని లక్ష్మీ పార్వతి అన్నారు.
సీపీఐ నారాయణ, రామకృష్ణలు పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని, ఏపీలో ప్రతిపక్షాలు ప్రజా కంఠకంగా మారాయని లక్ష్మీ పార్వతి విమర్శించారు. చంద్రబాబు మనసు, శరీరం కుళ్ళి పోయాయని విమర్శించారు. సహవాస దోషంతో పవన్ కళ్యాణ్ తప్పుడు మార్గంలో పయనిస్తున్నారని లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబుతో కలిసి వెళ్లడం వల్ల పవన్ కళ్యాణ్ కు నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.