Sajjala: పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెంచిన వైసీపీ
YCP is focusing more on Party Strengthening
ఏపీలో పార్టీ నిర్మాణంపై వైసీపీ మరింత దూకుడు పెంచింది. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులు, పరిశీలకులు, ముఖ్య నేతలతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహ సారధుల నియామక ప్రక్రియను కూడా సజ్జల సమీక్షించారు. గృహ సారధుల ఎంపిక గడువు ఈ నెల 30 వరకు పొడిగించినట్లు తెలిపారు.
ఈ నెల 20 నాటికి గృహ సారధుల నియామకం పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించిన విషయాన్ని నాయకులకు సజ్జల తెలియజేశారు. ఫిబ్రవరి 1 నుంచి 7 తేదీ వరకు గృహ సారధులతో మండల స్థాయి శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని సజ్జల సూచించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జుల అధ్యక్షతన మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని సజ్జల సూచించారు. ప్రతి 50 ఇళ్ళకు ఇద్దరు గృహ సారథులు ఉండాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం పై మరింత సూక్ష్మ స్థాయిలో వెళ్ళే దిశగా గృహ సారధుల వ్యవస్థ ఉండాలని నేతలకు సూచించారు.
175 స్థానాల్లోను గెలిచే ప్లాన్
వైఎస్ జగన్ గత కొన్ని నెలలుగా ఒకే మాట పదే పదే చెబుతున్నారు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలను గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. అదే లక్ష్యంతో పార్టీ కార్యకర్తలు, నేతలు పనిచేయాలని పదే పదే దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాల్లో లక్ష్యాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రతి అడుగు లక్ష్యం వేపే ఉండేలా చూసుకోవాలని నేతలకు నూరిపోస్తున్నారు.