YS Jagan Confidence: జగన్ కు ఎందుకంత కాన్ఫిడెన్స్?
YS Jagan Confidence: 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ ఎవరు ఊహించని విధంగా 151 స్థానాల్లో గెలిచింది. కేవలం 23 స్థానాలకే ప్రతిపక్షాన్ని పరిమితం చేసి ఒక్క సీటు మాత్రమే జనసేనకు వచ్చేలా చేసింది. అయితే ఈసారి అంతకు మించి అంటే ఏకంగా 175 స్థానాల్లో విజయం సాధించాలని జగన్ ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ ఒక్కసారి గనుక తాను గెలిస్తే మరో 30 ఏళ్ల వరకు తమదే ప్రభుత్వాన్ని జగన్ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అయితే జగన్ ఆశిస్తున్నట్లు నిజంగానే 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందా? అది అసలు సాధ్యమేనా వైఎస్ జగన్ ది కాన్ఫిడెన్సా? లేక ఓవర్ కాన్ఫిడెన్సా? అనే ప్రశ్నలు సాధారణ ప్రజలకే కాక రాజకీయ విశ్లేషకులను కూడా తొలిచేస్తున్నాయి.
ఎందుకంటే వైసీపీ ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న టీడీపీ జనసేన రెండింటిని తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. జనసేన విషయాన్ని పక్కన పెడితే తెలుగుదేశానికి గ్రామస్థాయి నుంచి పార్టీ వ్యవస్థ బలంగా ఉంది. జనసేనకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ రెండు కనుక కలిస్తే జగన్ను ఎదిరించడం పెద్ద విషయమేమీ కాదు అని విశ్లేషకులు చెబుతున్నా జగన్ పార్టీ వారు మాత్రం జగన్ చెబుతున్న మాటలనే వల్లె వేస్తున్నారు. మా జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమానికి పెద్ద పీట వేశారు, లెక్కకు మించి పథకాలు ప్రవేశపెట్టి ఎన్ని విమర్శలు వస్తున్నా పథకాల ద్వారా నగదు డైరెక్ట్ గా పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఆ నగదు పంపిణీ పథకాలే తమ శ్రీరామరక్ష అని చెబుతున్నారు.
అయితే జగన్ పాలనపై రాష్ట్రంలో సానుకూలత ఎంత ఉందో వ్యతిరేకత కూడా అంతే ఉందనేది విశ్లేషకుల వాదన. నిత్యవసర వస్తువులు ధరల పెరుగుదల, బస్సు చార్జీల పెంపు, ఇసుక దొరకకపోవడం, మూడు రాజధానుల కన్ఫ్యూజన్ , పెట్టుబడులు ఏపీకి తీసుకువచ్చే విషయంలో వెనుకబాటు తనం ఇలా కొన్ని విషయాల్లో జగన్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇంత వ్యతిరేకత ఉన్నా జగన్ మాత్రం వై నాట్ 175 అంటూ ముందుకు దూసుకు వెళుతున్నారు. ఇంతలా జగన్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయడానికి అసలు కారణం ఏమిటి అనేది ఎవరూ చెప్పలేని ప్రశ్న.
జగన్ ప్రభుత్వం మీద ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతను బట్టి చూస్తే 175 స్థానాల్లో విజయం అసాధ్యం అనేది విశ్లేషకుల వాదన. ఈ సారి అధికారం దక్కించుకోవడమే గగనంగా మారిపోతుంది అనుకుంటే 175 స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే గెలవాలని జగన్ కోరుకోవటం కాస్త వింతగానే ఉందని అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు సహా టిడిపిలో పలు కీలక నేతలు పోటీ చేసే నియోజకవర్గాలు ఎప్పటినుంచో టీడీపీకి కంచుకోటలు అనే ముద్ర వేసుకుంది. ఇలాంటి స్థానాల్లో వైసీపీ ఎలా గెలిచి 175 స్థానాలు దక్కించుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ది కాన్ఫిడెన్స్ అని కొందరు అంటుంటే కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ అని మరికొందరు అంటున్నారు. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏమిటో కింద కామెంట్ చేయండి.