AP BJP: ఏపీలో బీజేపీ టార్గెట్ ఇదేనా…?
AP BJP: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండటంతో పొత్తుల విషయంలో ఎవరూ నోరు మెదపడంలేదు, అనవసరంగా నోరు జారడంలేదు. ప్రజా వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, బీజేపీ ఈ విషయంలో ఒకింత వెనకబడి ఉన్నది. తెలంగాణలో ఆ పార్టీ దూకుడు ప్రదర్శిస్తూ వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నది. తెలంగాణ ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తుంటే, ఏపీలో మాత్రం బీజేపీ ఒకడుగు ముందుకు వేసి నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నది. బీజేపీకి కేడర్, క్షేత్రస్థాయిలో బలం లేకపోవడంతో ఆచీతూచి అడుగులు వేస్తున్నది. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తుఉన్నది. అయితే, జనసేన బీజేపీతో కలిసి పనిచేస్తున్నదా అంటే లేదని చెప్పాలి.
ఏ పార్టీకి ఆ పార్టీ పనులు చక్కదిద్దుకుంటున్నారు. పైగా, టీడీపీని వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నారు జనసేన నేతలు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య అధికారికంగా పొత్తు లేకున్నా, అనధికారంగా రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. 2014లో మాదిరిగా మూడు పార్టీలు కలిస్తే అది వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని భావించిన బీజేపీ సైలెంట్ గా ఉండాలని చూస్తున్నది. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసి అధికారంలోకి వస్తే, బీజేపీకి రాష్ట్రంలో కొంత ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఓడిపోతే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు కాబట్టి ఏదోలా ఏపీని మ్యానేజ్ చేయవచ్చని బీజేపీ భావిస్తున్నది. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ సైలెంట్‌గా ఉంటోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.