జూన్ నెలాఖరు వరకు ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవనున్నాయి. ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభ ఎంపీలుగా ఉన్న విజయసాయిరెడ్డి, సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు పదవీకాలం ముగియనుంది. ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలు ఈసారి వైసీపీ ఖాతాలోకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.
ఈ నాలుగు రాజ్యసభ సీట్ల కోసం పోటీ పడుతున్నవారి సంఖ్య భారీగా ఉంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ని మరోసారి కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిగతా మూడు స్థానాలకు ఎవర్ని ఎంపిక చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక సీటును ప్రముఖ వ్యాపారవేత్త అదాని భార్యకు లేదా అదాని సూచించిన వారికి కేటాయించనున్నారు. మరో సీటును టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో సీటును బీసీ వర్గానికి చెందిన వ్యాపారవేత్త బీద మస్తాన్ రావుకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే రాజ్యసభ సీటు కోసం మర్రి రాజశేఖర్ సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఈ నెలలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.విదేశీ పర్యటనకు వెళ్ళేలోపే రాజ్యసభ అభ్యర్థులు ఎవరనేది నిర్ణయిస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు.