Janasena- TDP: బాబు పవన్ భేటీ వల్ల ఎక్కువ నష్టం ఎవరికి?
Chandrababu- Pawan Kalyan Meeting: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ కావడం తాజా రాజకీయ అంశాలపై చర్చించడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీరు కలిసి పని చేశారు, మరోసారి పొత్తులు పెట్టుకుంటారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ మీద తీవ్ర ఆసక్తి నెలకొంది. దానికి తోడు భేటీ అయిన తర్వాత వీరిద్దరూ కలిసి నిర్వహించిన సంయుక్త సమావేశంలో రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం సహజమేనని గతంలో తాము టీఆర్ఎస్ తో కూడా కలిసి పనిచేసిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించడంతో దాదాపుగా వీరి పొత్తుల వ్యవహారం ఫైనల్ అయినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే నిజానికి ప్రస్తుతానికి జనసేన బిజెపితో పొత్తులో ఉంది.
టిడిపిని కలుపుకు వెళదామని బిజెపి అగ్ర నేతలకు జనసేన నుంచి సూచనలు వెళుతున్నా వారు మాత్రం టిడిపి విషయంలో ఎందుకో కానీ అంత సానుకూలంగా లేరనే చెప్పాలి. అలాగే పవన్ ను సైతం టిడిపికి దూరం చేయాలని కూడా బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజా పరిణామం వల్ల ఎవరికి నష్టం చేకూరుతుంది? అని రాజకీయ విశ్లేషకులను అడిగితే వారు మాత్రం అది జనసేనకే ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నివాసానికి స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్లి భేటీ కావడం సొంత సామాజిక వర్గమైన కాపుల్లోనే తీవ్ర ఆగ్రహం కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.
ఎందుకంటే ప్రస్తుతం ఎంత కాదనుకున్నా జనసేన మంచి బలంగా ఉంది. అందుకే జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి చాలా ప్రయత్నాలు చేస్తుందని వారు చెబుతున్నారు. ఇప్పుడే పొత్తుల విషయంలో ముందుకు వెళితే సీట్ల వ్యవహారంలో చాలా తక్కువ సీట్లు ఆఫర్ చేసే అవకాశం ఉందని ఎన్నికల నాటికి కచ్చితంగా జనసేన మరింత పుంజుకోవడం ఖాయం కాబట్టి ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ విషయం మీద ఒక నిర్ణయానికి వస్తే అప్పుడు సీట్లు కూడా జనసేనకు ఎక్కువ ఆఫర్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇలా చంద్రబాబుతో పవన్ భేటీ కావడం వల్ల పవన్ కళ్యాణ్ నాతో కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని భావించి చంద్రబాబు అండ్ కో సీట్లు తగ్గించి చెప్పే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అందుకే జనసేన అధినేత తొందరపడి పొత్తుల విషయంలో ఎలాంటి నిర్ణయానికి రాకుండా ఎన్నికల వరకు కనుక మరింత బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తే ఎన్నికల ముందు కాస్త ఎక్కువ సీట్లు అడిగి తీసుకోవచ్చని తద్వారా తనను నమ్ముకున్న నాయకుల్ని కూడా కొంతమేర సంతృప్తి పరిచే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి జనసేనకు ఎమ్మెల్యే కాండిడేట్లుగా ఉన్నవారు బిజెపితోనే తమ పొత్తు ఉంటుందని, తమకు సీటు గ్యారెంటీ అని చెబుతూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ పొత్తుల మీద ఒక క్లారిటీ ముందే ఇస్తే బాగుంటుందని వారు పేర్కొంటున్నా విశ్లేషకులు మాత్రం ఎన్నికలకు ముందే ఈ విషయం మీద ఒక క్లారిటీ వస్తే అదే జనసేనకు ప్లస్ అవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.