Vijaya Sai Reddy: అసలు విజయసాయి రెడ్డికి ఏమైంది?
Vijaya Sai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒకప్పుడు కీలకంగా ఉండేవారు, మరీ ముఖ్యంగా 2019లో అధికారంలోకి వచ్చే వరకు వైసీపీలో ఆయన నంబర్-2 అని అంటూ ఉండేవారు. ఆ తరువాత జగన్ సజ్జలను ఎంకరేజ్ చేయడంతో సాయి రెడ్డి సైలెంట్ అయ్యారు. అయినా పార్టీ వ్యవహారాలకు దూరమయ్యారు కానీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా చంద్రబాబు లోకేష్, పవన్ సహా రఘురామ వంటి వారికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉండేవారు. అయితే ఏమైందో ఏమో కానీ ఇటీవల కాలంలో ఆయన రాజకీయంగా పూర్తిగా మౌన మునిలా తయారు అయ్యారని అంటున్నారు. ఒకప్పుడు ప్రత్యర్థులపై పాత్రికేయ భాషకు అందని విధంగా నీచాతి నీచమైన ట్వీట్లు, విమర్శలు చేస్తున్నారంటూ వార్తల్లో నిలిచేవారు కాస్తా ఇప్పుడు అసలు మాట్లాడకపోవడం మీద చర్చ జరుగుతోంది.
గౌతమ బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు విజయసాయిరెడ్డికి ఎక్కడైనా జ్ఞానోదయం అయిందా అనే చర్చ సాగుతోంది. గత మూడు నెలలుగా ఆయన ట్విటర్ అకౌంట్‌ని పరిశీలిస్తే ఏ ఒక్కరిపైనా ఆయన నెగిటివ్ కామెంట్స్ చేసిన దాఖలాలు లేవు, కేవలం పుట్టిన రోజు శుభాకాంక్షలు, అభినందనలకకే పరిమితం అవుతున్నాయి. తమ ప్రభుత్వ పనితీరు బాగుందని చెబుతూ వేస్తున్న ట్వీట్లు, ఎవరైనా పదవులో, ఉన్నత స్థానాలను దక్కించుకుంటే ప్రోత్సాహకరంగా రెండు మాటలు చెప్పడం తప్ప ఇంకేం లేవు. చివరికి పప్పునాయుడు అంటూ ఎప్పుడూ ఎద్దేవా చేస్తూ ఉండే లోకేశ్‌కు కూడా విజయసాయిరెడ్డి బర్త్ డే విషెస్ చెప్పి అందరికి షాకిచ్చారు.
అలాగే తనకు అల్లుడు వరుసయ్యే నందమూరి తారకరత్న గుండె పోటుకు గురై బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నప్పుడు పరామర్శించడం మొదలు, మరణం, అంత్యక్రియల వరకూ విజయసాయిరెడ్డి వ్యవహరించిన తీరు ఆశ్చర్య పరిచింది. చంద్రబాబుతో మాటామంతీ, కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడం, అలాగే నందమూరి బాలకృష్ణ మీద ప్రశంసలు, జూనియర్ ఎన్టీఆర్‌తో చర్చలు చూస్తే ఆయన ఇంతకూ వైసీపీ ముఖ్య నాయకుడేనా? లేక రాజకీయం వదిలేశాడా ? అనే అనుమానం కూడా కలిగించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా విజయసాయిరెడ్డిని పక్కన పెట్టారనే ప్రచారం ఊపందుకుంది.
వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్ష బాధ్యతల్ని విజయసాయిరెడ్డికి ఇచ్చినట్టే ఇచ్చి దానికి అదనపు ఇంచార్జ్ అంటూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని కూడా ఆయనకు తగిలించారు. ఇక ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులను చెవిరెడ్డే ప్రకటించడం చర్చనీయాంశమైంది. అయితే ఆయన తనపై వస్తున్న కథనాలపై కూడా స్పందించడం లేదు, తన పనేంటో చూసుకుంటూ వెళ్లడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఎన్నికల సమరానికి వైసీపీ సమాయత్తం అవుతున్న కీలక సమయంలో విజయసాయిరెడ్డి మౌనం పాటించడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని, అది వైసీపీ పెద్దలకే బాగా తెలిసి ఉండొచ్చని అంటున్నారు. అయితే ఆ కారణం ఏమిటో అది వైసీపీకి లాభం కలిగిస్తుందో లేక నష్టం కలిగిస్తుందో కాలమే నిర్ణయించాలి.