వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం మందగించిందా? అవినాష్ రెడ్డికి నోటీసులతోనే సీబీఐ సరిపెడుతోందా? అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి నెల రోజులు కావస్తున్నా ఆలస్యం దేనికి?
AVINASH CBI : వై.ఎస్.వివేకానందరెడ్డి (Ys viveka) హత్య కేసు దర్యాప్తు గడువు మరో 40 రోజులే ఉంది. జూన్ 30 నాటికి విచారణ పూర్తి చేయాలని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు (supreme court) సీబీఐకి (cbi) గడువు పొడిగించింది. గత ఏప్రిల్ 30కే గడువు ముగియగా తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి (avinash reddy) ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులతో గందరగోళం తలెత్తింది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరగా హైకోర్టు (high court) నిర్ణయాన్ని తప్పుపట్టింది. అలాగే దర్యాప్తు గడువును మరో రెండు నెలలు పొడిగించింది. ఆ తర్వాత తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కోరుతూ అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. దానికి సమాధానంగా నాలుగు రోజుల గడువు కావాలని లేఖ రాశారు. అందుకు సమ్మతించిన సీబీఐ ఈ నెల 19న విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే 5 సార్లు నోటీసులు అందుకొని విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి ఈసారి అరెస్ట్ తప్పదేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇదే క్రమంలో మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఊరట దక్కలేదు. ఈ పరిణామాలు చూస్తుంటే ఈనెల 19న విచారణకు హాజరైతే అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదేమో అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
అభ్యర్థన ఏంటి..?
తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపేలా ఆదేశించాలని సుప్రీం కోర్టును అవినాష్ రెడ్డి అభ్యర్థించారు. ఈ విషయం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉండటం వల్ల ముందస్తు బెయిల్‌పై (Anticipatory Bail) విచారణ త్వరగా జరగడం లేదని పిటిషన్లో ప్రస్తావించారు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాష్ రెడ్డి తరఫు లాయర్లు కోరారు. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ తేదీని ఖరారు చేయలేదు. ఒకవేళ విచారణ అత్యవసరం అయితే రాతపూర్వకంగా అభ్యర్ధన ఇవ్వాలని సీజేఐ ధర్మాసనం సూచించింది. అత్యవసరాన్ని బట్టి తాము నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
దూకుడు తగ్గిందా..?
వివేకా హత్య కేసులో సుప్రీం కోర్టు ఏప్రిల్ 30 వరకు దర్యాప్తునకు గడువు విధించగా ఆ లోపే కేసును ముగించేలా సీబీఐ దూకుడు ప్రదర్శించింది. వరుస అరెస్టులతో నిందితులు ఉలిక్కి పడేలా చేసింది. వైఎస్ భాస్కర్ రెడ్డి సహా కీలక నిందితులను లోపలేసింది. అలాగే హైకోర్టుకు వెళ్లి ఎర్ర గంగిరెడ్డి (erra gandi reddy) ముందస్తు బెయిల్ రద్దయ్యేలా చేయగలిగింది. అతను కూడా మే 5నే లొంగిపోయాడు. ఆ తర్వాత దర్యాప్తునకు గడువు జూన్ 30 వరకు పొడిగింపు లభించింది. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి చేస్తున్న అభ్యంతరాలపైనా దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిని పలుమార్లు విచారించారు. మంగళవారం కూడా మరోసారి ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలుస్తోంది. వివేకా మొబైల్ ఫోన్‌తో పాటు ఆయన రాసిన లేఖను ఎందుకు దాచారనే కోణంలో ఆరా తీసినట్లు సమాచారం. అలాగే కడప జిల్లాకు చెందిన ఇద్దర్ని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అవినాష్‌రెడ్డి కాల్‌డేటాలోని అంశాల ఆధారంగా వాళ్లను ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
ఆలస్యం ఎందుకు..?
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనే కేసు కొలిక్కి వస్తుందని సీబీఐ ముందు నుంచీ చెబుతోంది. ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేస్తున్న అవినాష్ రెడ్డి వాదనలపైనా సుప్రీం కోర్టులో అభ్యంతరం చెప్పింది. హైకోర్టు ఆదేశాల వల్ల కేసు దర్యాప్తుపై ప్రభావం పడిందని వాదించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు అరెస్ట్ నుంచి అవినాష్‌కు రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్ ప్రయత్నాలపై మరోసారి హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. అయితే ఆ వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. అయితే అవినాష్‌ను ఏ క్షణమైనా అరెస్ట్ (arrest) చేస్తారనే ప్రచారం జరిగింది. సీబీఐ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. వివేకా హత్య కేసులో అవినాష్ నిందితుడు అనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతున్న దర్యాప్తు సంస్థ అరెస్ట్ విషయంలో ఎందుకు వెనకాడుతోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని సుప్రీం కోర్టు చెప్పి కూడా దాదాపు నెల రోజులు కావస్తోంది. అయినా తాత్సారం ఎందుకు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
సీబీఐ చీఫ్ మార్పు..?
సీబీఐ డైరెక్టర్ మార్పు వ్యవహారం వివేకా హత్య కేసులో ప్రభావం చూపుతుందా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణాటక డీజీపీగా 3 ఏళ్లు పని చేసిన ప్రవీణ్ సూద్ (Praveen sood) సీబీఐ డైరెక్టర్‌గా (cbi new director) నియామకం అయ్యారు. డీజీపీ హోదాలో బీజేపీ ప్రభుత్వానికి వంత పాడారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక ఫలితాల మరుసటి రోజే అతన్ని సీబీఐ డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. వివేకా హత్య కేసులో సీబీఐ కొత్త డైరెక్టర్ డైరెక్షన్ ఎలా ఉండనుందనే చర్చ జరుగుతోంది. కర్ణాటకతో ఆంధ్రప్రదేశ్ నేతలకు మంచి సంబంధాలు ఉంటాయి. ముఖ్యంగా రాయలసీమ రెడ్లు అక్కడ చక్రం తిప్పుతారనే వాదనలు ఉన్నాయి. ఇదే క్రమంలో పాత పరిచయాలతో వివేకా హత్య కేసులో సీబీఐ డైరెక్టర్‌తో ఏదైనా లాబీయింగ్ నడుపుతారా అనే చర్చ జరుగుతోంది. కేసులో అవినాష్‌ను తప్పించేలా తెరవెనుక ప్రయత్నాలు జరగొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19న అవినాష్ సీబీఐ విచారణకు హాజరైతే ఆ తర్వాత పరిణామాలతో ఓ స్పష్టత వస్తుందని అంతా భావిస్తున్నారు.