GIS 2023: ఏపీకి భారీ పెట్టుబడులు- తొలి రోజే రూ. 11.82 లక్షల కోట్ల ఒప్పందాలు
Vizag Global Investors Summit: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతంగా జరుగుతున్నది. మార్చి 3, 4 తేదీనల్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కాగా, మొదటిరోజు ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు. తొలిరోజు రూ. 11.82 లక్షల పెట్టుబడులకు సంబంధించి 92 ఎంఓయూలు చేసుకున్నారు. తొలిరోజున ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లాతో పాటు సుమారు 30 దిగ్గజ కంపెనీలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. రెండో రోజు 1.15 లక్షల కోట్లకు సంబంధించి 248 ఎంఓయులు జరగనున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మొత్తం 13 లక్షల కోట్లకు సంబంధించి 340 ఎంఓయులు జరుగుతున్నట్లు సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటికే ఆరు పోర్టులు, ఆరు విమానాశ్రయాలు ఉన్నాయని, మరో నాలుగు పోర్టులు రానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా రిలయన్స్, అదానీ, రెన్యూ ఎనర్జీ, అరబిందో, డైకిన్, ఎన్టీపీసీ, జిందాల్, మెండలీస్, శ్రీ సిమెంట్స్ వంటి సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సీఎం ఈ సదస్సులో పేర్కొన్నారు. కాగా, ఈ సదస్సు రెండో రోజైన నేడు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్నది. మధ్యాహ్నం 2 గంటలకు సదస్సు ముగియనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.