Viveka Murder Case: సునీల్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్ట్
Viveka Murder Case: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతున్న సమయంలో బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు సీబీఐ, వైఎస్ సునీతా వేసిన ఇంప్లీడ్ పిటిషన్లపైనా హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి.
సీబీఐ తరఫున స్పెషల్ న్యాయవాది నాగేంద్రన్ వాదనలు వినిపించారు. తాను అమాయకుడినని.. హత్యతో సంబంధం లేదని సునీల్ అంటున్నారని.. ఏ సంబంధమూ లేని వ్యక్తి గోవాకు ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. వాదనల సందర్భంగా సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోరింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకుందని, హత్యలో రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు వివరించింది. వాదనలూ నమోదు చేసిన హైకోర్టు.. వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా సాక్షుల భద్రత అతి ముఖ్యమని పేర్కొంటూ సునీల్ కుమార్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.