Vishnukumar Raju: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలవాల్సిందే.. కీలక నేత కామెంట్లు వైరల్!
Vishnukumar Raju: ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో గెలిచిన సీట్లు సైతం బీజేపీ కోల్పోయిందనే సంగతి తెలిసిందే. గతంలో టీడీపీ మద్దతు ఉన్న సమయంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన పీవీఎన్ మాధవ్ ఈసారి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. దీనిపై ఆ పార్టీలో అంతర్మథనం మొదలైందని తాజాగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు నిజం చేస్తున్నాయి. తాజాగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ముగ్గురు కలవాలని అన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలవాలని, తెలంగాణలో బీజేపీ పోరాట స్పూర్తి చూపించిందని అన్నారు. ఇక ఈ ఏపీ ఎమ్మెల్సీ ఫలితాలపై పార్టీ నాయకత్వం అంతర్మధనం చేసుకోవాలని, వైసీపీ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసినా గెలవలేదు అంటే ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్ధం అవుతోందని అన్నారు. ఇక వైసీపీతో కుమ్మక్కయ్యారనే ప్రచారం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఓడిపోయినట్లు పేర్కొన్న ఆయన ఇక్కడ బీజేపీ-వైసీపీ ఒక్కటేనన్న అభిప్రాయం ఓటర్లలో బలంగా వెళ్లడం వల్లే బీజేపీ ఓడిపోయిందన్నారు. అయితే ఏపీలో వైసీపీ, టీడీపీలకు సమాన దూరం అంటూ బీజేపీ రాష్ట్ర నేతలు పదే పదే చెబుతున్న నేపథ్యంలో విష్ణు కామెంట్స్ సంచలనంగా మారాయి.