Vijaya Sai Reddy: విజయసాయి రెడ్డి అందుకే దూరమయ్యారా?
Vijaya Sai Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీలో కీలక నేతలు ఎవరు అంటే చాలా మంది పేర్లు బయటకు వస్తాయి. కానీ జగన్ తర్వాతి స్థానం ఎవరిది అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అనే పేరు బయటకు రావచ్చు. కానీ ఒకప్పుడు విజయసాయి రెడ్డికి ఆ గుర్తింపు ఉండేది. పార్టీకి నెంబర్ 2 ఎవరు అంటే వెంటనే.. ఆయన పేరే చెప్పేవారు. ఛార్టెడ్ అకౌంటెంట్‌గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిచయమైన ఆయన… అన్ని కంపెనీలకి చార్టెడ్ అకౌంట్‌గా వ్యవహరిస్తూనే ఆయన అనేక సంపాదన మార్గాలను కూడా చెప్పారని… అందుకే ఆయన అంటే జగన్‌కి గురి ఉంటుందనే ప్రచారం ఉంది. ఒకప్పుడు విజయసాయి రెడ్డి వైఎస్ జగన్ కుడి భుజం అని అనిపించుకునేవారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారనే విషయాన్ని వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటారు. జగన్ కుటుంబంతో విజయసాయిరెడ్డి బంధం కూడా ఇప్పటిది కాదు..
. జగన్ తాత రాజారెడ్డి నుంచి రాజశేఖర్ రెడ్డి తర్వాత ఇప్పుడు జగన్ వరకు ఆయన కుటుంబానికి విధేయుడు గానే ఉంటూ వస్తున్నారు. అయితే అలాంటి విజయ్ సాయి రెడ్డికి జగన్‌కు మధ్య చెడిందని… వారి మధ్య దూరం పెరిగిందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ విభేదాలకు ముఖ్య కారణం జగన్.. విజయసాయిరెడ్డి చేతిలో ఉన్న కీలకమైన బాధ్యతలు వెనక్కి తీసుకొని తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి చేతిలో పెట్టడమేనని అంటున్నారు. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లి అక్కడ పార్టీ విషయంలో పూర్తిగా పట్టు సాధించిన విజయసాయిరెడ్డిని పక్కనపెట్టి అక్కడ వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు జగన్. అందుకే విజయసాయిరెడ్డి విశాఖ వెళుతున్నా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించకపోవడం లేదని అంటున్నారు. అలాగే తారకరత్న మృతి చెందిన సమయంలో కూడా ఆయన చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహితంగా మెలగడం టీడీపీ నేతలు వద్దని వారిస్తున్నా సరే చంద్రబాబుతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించడంతో పాటు బాలకృష్ణ మీద పొగడ్తల వర్షం కురిపించడం కూడా జగన్‌కు ఆయన దూరం చేశాయని అంటున్నారు.
అయితే ఒకప్పుడు పార్టీలో నెంబర్ 2 గా వ్యవహరించి జగన్‌కు అన్నీ తానై వ్యవహరించిన వ్యక్తిని ఇలా జగన్ దూరం పెడతారా అంటే ఎవరు అవునని కాదని సమాధానం చెప్పలేని పరిస్థితి. అయితే ఇన్ని వార్తలు వస్తున్నా ఈ విషయం మీద జగన్ కానీ… విజయసాయి రెడ్డి కానీ.. ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటివరకు అంతా ఊహాగానాలని ప్రచారమే జరుగుతోంది. విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. మరోసారి ఆయన పదవీకాలం పొడిగించే సమయానికి నిజంగా ఆయనను జగన్ పక్కన పెట్టారా… లేక ఇదంతా ప్రచారమా అని క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే విజయసాయిరెడ్డి పార్టీకి దూరంగా ఉండటం మాత్రం మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఆయన చూసుకుని సోషల్ మీడియాని కూడా సజ్జల భార్గవ్ రెడ్డికి అప్పగించడం పార్టీలోనే చాలామందికి నచ్చడం లేదు.