Vangaveeti Radhakrishna: బాబు భరోసా.. లోకేష్ యాత్రలో మెరిసిన వంగవీటి!
Vangaveeti Radhakrishna: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నిరుద్యోగులు, ఇక తమకు ఉన్న పార్టీలో సీటు రాదని భావిస్తున్న వారు ఇతర పార్టీలోకి వెళ్లి సీట్లు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ వలస రాజకీయాలు ఇప్పటికే మొదలైపోయాయి. దాదాపుగా తాము చేరే కొత్త పార్టులో కూడా ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడేవారు ఉన్నారని తెలిసినా తమకు అవకాశం దొరక్కపోతుందా? అనే ఆశతో ఇతర పార్టీల్లోకి దూకుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూనే పార్టీలో యాక్టివ్గా లేకుండా సైలెంట్ గా ఉంటున్న విజయవాడకు చెందిన కీలక నేత వంగవీటి మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక 2024 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచే ఒక కీలకమైన స్థానం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న తరుణంలో టిడిపికి షాక్ ఇచ్చి జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన జనసేన అధినేత పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన మచిలీపట్నంలో జరగబోయే జనసేన ఆవిర్భావ సభలో రాధా పార్టీలో చేరుతున్నట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే అనూహ్యంగా ఈ వార్తలు పుట్టించిన వారికి రాసిన వారికి షాక్ ఇచ్చే విధంగా వంగవీటి రాధాకృష్ణ ఈరోజు తన అనుచరులతో కలిసి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. కేవలం పాదయాత్రలో పాల్గొనడమే కాదు నారా లోకేష్ తో పాదయాత్రలో పాల్గొన్న తర్వాత విరామ సమయంలో సుదీర్ఘంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. తన గురించి జరుగుతున్న ప్రచారం నిజం కాదని తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని కచ్చితంగా టిడిపిలోనే ఉండి తాను టికెట్ తీసుకోవడమే కాదు తనకు అప్పచెప్పిన అభ్యర్థుల బాధ్యత కూడా తానే తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి రాధా జనసేనలో చేరేందుకు అని ఏర్పాట్లు చేసుకున్నారని విషయం తెలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా రాధాకృష్ణకు ఫోన్ చేసి టిడిపిలోనే ఉండాలని రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడమే కాక డబ్బు బాధ్యతలు అన్ని తామే చూసుకుంటామని, గెలిపించే బాధ్యత కూడా తాము తీసుకుంటామని హామీ ఇచ్చి ఇవ్వడంతో ఆయన మనసు మార్చుకుని లోకేష్ పాదయాత్రలో పాల్గొనడం ద్వారా తాను పార్టీ మారడం లేదని సంకేతాలు ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.
చంద్రబాబు ఇచ్చిన భరోసాతో కాపుల ఓటు బ్యాంకు బలంగా ఉన్న సీట్లలో కూడా తాను ప్రచారం చేయడానికి వెళతానని ఈ సందర్భంగా లోకేష్ కి మాట ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ నుంచి వంగవీటి రాధాకృష్ణ బయటకు వెళ్ళిపోతారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన తెలివిగా నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని ఒక్కసారిగా ఈ వార్తలు అన్నింటికీ బ్రేకులు వేసినట్లు అయింది. మరి చూడాలి రాబోయే కాలంలో ఏం జరగబోతోంది అనేది.