TTD Meeting:ముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశం..కీలక నిర్ణయాలకు ఆమోదం
TTD trust Board Meeting:తిరుమలలో ఇవాళ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 75 అంశాలు ఎజెండా కింద చేర్చి కీలకనిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27న బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 1న గరుడ వాహనం, 5న చక్రస్నానం నిర్వహిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిన తర్వాత సర్వదర్శన టోకెన్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. గత ఏప్రిల్ 14న భక్తుల అధిక రద్దీ కారణంగా టోకెన్లు జారీ చేయడంతో తోపులాట జరిగింది. దీంతో టోకెన్లు నిలిపివేసింది టీటీడీ ఇప్పుడు తిరిగి వాటిని పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
తిరుమలలో నూతన పార్వేట మండపం నిర్మాణానికి టీటీడీ ఆమోదం తెలిపింది. శ్రీవారి పోటు ఆధునీకరణ, ఈ ఏడాది చివరికి శ్రీనివాస సేతును పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులో తీసుకురావడంతో పాటు నిర్మాణానికి నిధులు కేటాయింపుపై చర్చించి ఆమోదం తెలిపారు. రూ.7.32 కోట్లతో ఎస్వీ గోశాలలో పశుగ్రాసం కొనుగోలుకు టీటీడీ ఆమోదం తెలిపింది. అమరావతిలోని శ్రీవారి ఆలయంలో పచ్చదనం పెంపు, సుందరీకరణకు రూ.2.90 కోట్లు కేటాయించారు. తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామి వెండి కవచాల స్థానంలో బంగారు కవచాలు అమర్చాలని నిర్ణయించారు. ఆటోమెటిక్ మెషిన్లతో లడ్డూ బూందీ తయారీపై టీటీడీ సమావేశంలో చర్చించారు. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ కు చెందిన సాంకేతికత వినియోగించాలని నిర్ణయించారు.