TTD: భక్తులకు టీటీడీ షాక్… భారీగా పెరిగిన గదుల అద్దెలు
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు షాకిచ్చింది. ఇప్పటి వరకు భక్తుల కోసం రూ. 500, రూ. 600 గదుల అద్దెను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ గదుల అద్దెలను రూ. 1000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. గదుల ఆధునీకరణకోసం రూ. 110 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు టీటీడీ తెలియజేసింది. గదులను నవీనీకరణ చేసి మరికొన్ని వసతీసౌకర్యాలు కల్పించబోతున్నట్లు అధికారులు తెలియజేశారు. దీంతో అద్దెలను రూ. 1000కి పెంచుతున్నట్లు తెలిపారు. అద్దె గదుల ధరలు ఒక్కసారిగా పెరగడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తులపై టీటీడీ అదనపు భారం మోపుతున్నదని వాపోతున్నారు. దర్శనం కోసం టిక్కెట్లు దొరక్క గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉంటున్నామని, ఇప్పుడు అద్దె ధరలను కూడా పెంచితే మరింత భారం పడుతుందని భక్తులు చెబుతున్నారు. కరోనాకు ముందున్న విధంగా దర్శనం చేసుకునే అవకాశాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. సర్వదర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా టీటీడీ చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక పర్వదినాల్లో కూడా సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.