TTD: శ్రీవాణి ట్రస్టు నిధులు దారి మల్లింపు అవాస్తవం – ఈఓ ధర్మారెడ్డి
TTD EO Dharma reddy denies Funds diversion of Sri Vani Trust
శ్రీవాణి ట్రస్టు నిధులు దారి మళ్లుతున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఈఓ దర్మారెడ్డి ఖండించారు. ఆ వార్తలన్నీ అవాస్తవేలని కొట్టిపారేశారు. శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటి వరకు రూ.650 కోట్ల నిధులు సమకూరాయని తెలిపారు. దేవాదాయశాఖ నిర్మిస్తున్న ఆలయాలకు శ్రీవాణి ట్రస్ట్ నుండి రూ.100 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని వివరించారు.
శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేక అకౌంట్ ఉంటుందని, జనరల్ అకౌంట్ కు శ్రీవాణి ట్రస్టు నిధులు వచ్చే అవకాశంలేదని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్టు నిధుల్లో 50 శాతం టీటీడీ జనరల్ అకౌంట్ కు వెళ్తున్నాయనేది అవాస్తవమని తెలిపారు.
దేవాదాయ శాఖ ద్వారా ఏపీలో పలు ప్రాంతాల్లో 932 ఆలయాలు నిర్మాణంలో ఉన్నాయని ధర్మారెడ్డి తెలిపారు. దేవాదాయశాఖ నిర్మిస్తున్న ఆలయాలకు శ్రీవాణి ట్రస్ట్ నుండి రూ.100 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని తెలిపారు. మరో 647 ఆలయాలకు వినతులు వచ్చాయని వివరించారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాలకు రూ.130 కోట్లు కేటాయించామని తెలిపారు.
భద్రత విషయంలో రాజీ లేదు
టీటీడీలో భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడటంలేదని ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయ డ్రోన్ దృశ్యాలపై వివరణ ఇచ్చారు. తిరుమలలో డ్రోన్ సర్వేకు IOCL కు పర్మిషన్ ఇచ్చిన మాట వాస్తవమేనని ధర్మారెడ్డి అంగీకరించారు. అన్నదానం వద్ద నుండి డంపింగ్ యార్డ్ వరకు వారికి డ్రోన్ సర్వేకు పర్మిషన్ ఇచ్చామని తెలిపారు.
టీటీడీ హై సెక్యురీటీ వ్యవస్థ ఉందని, త్వరలో తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకొస్తున్నామని తెలిపారు. ఇటీవలే తిరుమల ఆలయానికి చెందిన డ్రోన్ దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇప్పటికే డ్రోన్ల వ్యవహారంపై కేసు నమోదు చేశామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. వైరల్ అయిన వీడియోలు నిజమైనవా లేక ఫేక్ వీడియోలా అనే విషయం తేలాల్సి ఉందని ధర్మారెడ్డి తెలిపారు. డ్రోన్ ఆపరేటర్లు అత్యుత్సాహంతో వీడియోలు తీసుంటే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.