TTD EO: తిరుమలలో అద్దె గదుల రేట్ల పెంపు.. టీటీడీ క్లారిటీ ఇదే!
TTD EO Dharma Reddy Clarity on Room Rents: తిరుమలలో ఇటీవల కొన్ని వసతి గృహాల అద్దె ధరలు పెంచినట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం మీద ఈఓ ధర్మారెడ్డి స్పందించారు. ఇక గదుల ధరల పెంపు విషయంలో రాజకీయం చేయడం చాలా బాధాకరమని ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలో మొత్తం 7500 గదులు, నాలుగు యాత్రికా సదన్ లు ఉన్నాయని వెల్లడించిన ఆయన 50,100 రూపాయల గదులు 5 వేలు ఉన్నాయని, ఈ ధరలు 40 సంవత్సరాల క్రితం నిర్ణయించినవి అని పేర్కొన్నారు. తిరుమలలో 120 కోట్ల రూపాయలతో పలు గదులను ఆధునీకరించామని ఆ 50,100 రూపాయల గదులల్లో ఫ్లోరింగ్,గ్రీజర్లు వంటివి కల్పించామని అన్నారు. ఇవి కాకుండా తిరుమలలో పద్మావతి, ఎంబిసి కార్యాలయాల్లో ప్రముఖులకు ఇచ్చే గదులు ఉంటాయని అలాగే నారాయణగిరి, ఎస్వీ అతిథి గృహం,స్పెషల్ టైప్ అతిథి గృహాలు వీఐపీ కోటా కింద ఉన్న గదులని అన్నారు. ఎంబిసి కార్యాలయం కింద ఉన్న ఈ మూడు అతిధి గృహాలకు సంబంధించిన గదుల ధరలు మాత్రమే పెంచామని ఆయన అన్నారు. పద్మావతీ, ఎంబిసి కార్యాలయాలకు సంబంధించి వ్యత్యాసం లేకుండా చేయాలని పెంచామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. 8 కోట్ల వ్యయంతో ఈ అతిథి గృహాలను ఆధునీకీకరించామని, 170 గదులను పూర్తిగా మరమ్మత్తులు చేసి వ్యత్యాసం లేకుండా ధరలు పెంచామని అన్నారు. ఇక మిగతా 50,100 గదుల ధరలు పెంచే ఆలోచన లేదని ఆయన వెల్లడించారు. మరమ్మతులు చేసిన గదులకు ఒక్కోగదికి ఐదు లక్షలు ఖర్చు చేశామని అన్నారు.