TTD Angapradakshinam Tokens released today: గుడ్‌న్యూస్..నేడు శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లను విడుదల
TTD Angapradakshinam Tokens released today: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లను విడుదల చేయనున్నది. ఈరోజు ఆన్‌లైన్ ద్వారా ఈ టోకెన్లను విడుదల చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఈ టోకెన్లను విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, శ్రీవారి ఆలయంలో బాలాలయం పనులు జరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 22 నుండి 28 వ తేదీ వరకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీని నిలిపివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఫిబ్రవరి నెలలో 21 వ తేదీ వరకు మాత్రమే అంగప్రదక్షిణ కోసం టోకెన్లు అందుబాటులో ఉండనున్నాయి. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్ ద్వారా టోకెన్లను పొందాలని అధికారులు పేర్కొన్నారు. కరోనా తరువాత శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. గతంలో మాదిరిగానే టోకెన్లు లేకున్నా భక్తులను సర్వదర్శనం కోసం అనుమతిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను టీటీడీ ఏర్పాటు చేస్తున్నది. ఇక సోమవారం రోజున 70,413 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో 32,206 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లుగా ఉందని అధికారులు తెలియజేశారు.