Tirumala Suprabhata Seva: తిరుమలలో ప్రారంభమైన సుప్రభాత సేవ
Tirumala Suprabhata Seva: తిరుమలలో సుప్రభాత సేవలను పునఃప్రారంభించారు. ధనుర్మాసం కారణంగా నెల రోజులపాటు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను నిలిపివేసి ఆ స్థానంలో తిరుప్పావై ను నిర్వహించారు. ధనుర్మాసం ముగియడంతో తిరిగి సుప్రభాత సేవలను పునఃప్రారంభించినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగలో మూడో రోజైన కనుమ నాడు శ్రీవారి పార్వేట ఉత్సవాన్నిటీటీడీ నిర్వహించింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకున్నది.
మెట్టు మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల కోసం ఎంబీసీ ప్రాంతంలో మినీ అన్నదాన సముదాయం నిర్మించాలని నిర్ణయించింది. కాలి నడకన వచ్చే భక్తులకు ఇప్పటికే టీటీడీ మార్గమధ్యంలో అన్నదానం ఏర్పాటు చేసింది. అయితే, అన్నదాన సముదాయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలను పంపిణి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. పండుగ పర్వదినాలు ముగియడంతో భక్తుల రద్ధీ కొంతమేర తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చూస్తున్నామని, మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.