శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల గిరులు ముస్తాబయ్యాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం అంటే నిన్న అంకురార్పరణ జరిగింది. ఇక ఈరోజు సాయంత్రం ఆరున్నర లోపు ధ‌్వజారోహణం నిర్వహిస్తారు.
Brahmotsavalu : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల గిరులు ముస్తాబయ్యాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం అంటే నిన్న అంకురార్పరణ జరిగింది. ఇక ఈరోజు సాయంత్రం ఆరున్నర లోపు ధ‌్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
శ్రీనివాసుడు తిరుమల(Tirumala) గిరులలో వెలిసిన తొలినాళ్లలోనే ..బ్రహ్మదేవుడిని పిలిచిన వేంకటేశ్వరుడు( Lord Srivenkateswara) లోకకళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. గోవిందుడు చెప్పిన ప్రకారం ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి.. కన్యామాసం అంటే ఆశ్వయుజంలోని శ్రవణ నక్షత్రం(Sravana Nakshatram) నాటికి పూర్తయ్యేలా.. బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మాండంగా ఉత్సవాలు నిర్వహించారట. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధిచెంది..ఆ నాటి నుంచి నేటి వరకూ నిరాటంకంగా ఈ బ్రహ్మోత్సవాలు(Brahmotsavalu) కొనసాగుతున్నాయి.
చాంద్రమానం ప్రకారం ప్రతి మూడో ఏడాది అధికమాసం వస్తూ ఉంటుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం అంటే భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో అంటే ఆశ్వయుజంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ రెండు బ్రహ్మోత్సవాలకు పెద్ద తేడా ఉండదు గానీ, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం(Dwajarohanam,), ధ్వజావరోహణం ఉండవు. ఈ సంవత్సరం అధికమాసం ఉండటం వల్ల సెప్టెంబరు 18 నుంచి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కాంక్షించడంతో పాటు ..శ్రీ వేంకటేశ్వరస్వామివారి మంగళకరమైన ఆశీస్సులను భక్తులందరికీ అందించేందుకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
భక్తులెవరకీ ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూలవిరాట్ దర్శనం కల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీలలో వేచివుండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు.
బ్రహ్మోత్సవాల సమయంలో బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించబడవు. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే అనుమతిస్తారు. అలాగే ఈ సమయంలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలతో వచ్చే తల్లిదండ్రులు వంటి ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబరు 22న గరుడసేవ రోజు ఘాట్ రోడ్లలో బైక్స్ రాకపోకలను అధికారులు రద్దు చేశారు.