Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలు- ఎల్లుండే అంకురార్పణ
Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు చెకచెక సాగుతున్నాయి. టీటీడీ అధికారులు ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 25 వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనున్నది. 27 వ తేదీన ధ్వజారోహణంతో పాటు బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. 27 వ తేదీ మధ్యాహ్నం మాడవీధుల్లో గరుడపఠం, పరివార దేవతల ఊరేగింపు జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు ప్రారంభం సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 27వ తేదీ రాత్రి 9 గంటలకు శ్రీవారు పెద్ద శేష వాహనంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తారు.
ఇక 28వ తేదీ ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనంపైన, అదేరోజు రాత్రి 7 గంటలకు హంస వాహనంపైన శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక, 29 వ తేదీ ఉదయం 8 గంటలకు సింహవాహనంపై, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇస్తారు. 30 వ తేదీ ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపైన, అక్టోబర్ 1 వ తేదీ ఉదయం 8 గంటలకు మోహినీ అవతారంలోనూ, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపైన స్వామివారు దర్శనం ఇస్తారు.
అక్టోబర్ 2 వ తేదీ ఉదయం 8 గంటలకు హనుమంత వాహనంపై, సాయంత్రం 5 గంటలకు స్వర్ణరథంపై, రాత్రి 7 గంటలకు గజవాహనంపైన, అక్టోబర్ 3 వ తేదీ ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అక్టోబర్ 4 వ తేదీ ఉదయం 6 గంటలకు రథోత్సవం జరగనున్నది. అదేవిధంగా రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై శ్రీవారు ఊరేరగనున్నారు. అక్టోబర్ 5 వ తేదీన ఉదయం 6 గంటలకు చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.