Tirumala: నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు
Tirumala: ఈరోజు నుంచి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనున్నది. అంకురార్పణ అనంతరం రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపటి రోజున ధ్వజారోహణం, పెద్ద శేష వాహన సేవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ప్రభుత్వం తరపున ఆయన పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
28వ తేదీ ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనంపైన, అదేరోజు రాత్రి 7 గంటలకు హంస వాహనంపైన శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక, 29 వ తేదీ ఉదయం 8 గంటలకు సింహవాహనంపై, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇస్తారు. 30 వ తేదీ ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపైన, అక్టోబర్ 1 వ తేదీ ఉదయం 8 గంటలకు మోహినీ అవతారంలోనూ, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపైన స్వామివారు దర్శనం ఇస్తారు.
అక్టోబర్ 2 వ తేదీ ఉదయం 8 గంటలకు హనుమంత వాహనంపై, సాయంత్రం 5 గంటలకు స్వర్ణరథంపై, రాత్రి 7 గంటలకు గజవాహనంపైన, అక్టోబర్ 3 వ తేదీ ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అక్టోబర్ 4 వ తేదీ ఉదయం 6 గంటలకు రథోత్సవం జరగనున్నది. అదేవిధంగా రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై శ్రీవారు ఊరేరగనున్నారు. అక్టోబర్ 5 వ తేదీన ఉదయం 6 గంటలకు చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి