Thota Chandrasekhar:రఘునందన్ వ్యాఖ్యలపై స్పందించిన తోట.. త్వరలో విశాఖలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ
Thota Chandrasekhar: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. తోట చంద్రశేఖర్‌కుచెందిన ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి రూ. 4 వేల కోట్ల రూపాయల మియాపూర్ భూములను అప్పగించారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. హాఫిజ్ పేటలోని సర్వే నెంబర్ 78 లో వున్న 40 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అమ్ముకోవడానికి సర్కార్ అనుమతి మంజూరు చేసిందని రఘునందన్ రావు ఆరోపించారు.
భూ దందా కోసమే తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకుని ఏపీకి అధ్యక్షుడిని చేశారని విమర్శించారు. మియాపూర్ భూములతో లాభపడిన తోట చంద్రశేఖర్ ఖమ్మం సభకు ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలపై తోట చంద్రశేఖర్ స్పందించారు. తనపై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు చిల్లర రాజకీయాల కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు. బీఆర్ఎస్ ఖమ్మం బహిరంగ సభ నుంచి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికే బీజేపీ పనికిమాలిన ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసాడు. రఘునందన్ రావు చేస్తున్న ఆరోపణలు నిజమైతే.. ఆ సర్వే నెంబర్ భూమిలో 90 శాతం తననే తీసుకుని మిగిలిన 10 శాతాన్ని నాకు ఇవ్వమని చెప్పండి అంటూ ఎద్దేవా చేసారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర కీలకం కాబోతుందని అన్నారు.
ఇక రాబోయే రోజులో విశాఖలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక ను సిద్ధంచేస్తున్నాడని తెలిపారు. దాదాపుగా లక్షమందితో ఈ బహిరంగ సభ ఉండబోతుందని సమాచారం అందుతుంది. గతం లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఏపీ నిరుద్యోగ ఐక్య కార్యచరణ సమితి ప్రతినిధులు విశాఖలో క్షీరాభిషేకం చేశారు. తెలంగాణలో 91వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న కేసీఆర్‌కు వారు అభినందనలు తెలిపారు. అక్కడే సభ ఏర్పాటు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు కెసిఆర్ ఓకే భరోసా ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఇక నేడు ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. దాదాపుగా ఐదు లక్షలమందితో ఈ సభ నిర్వహించనుంది.