కంచే చేను మేస్తే.. తిరుమల, ఇంద్రకీలాద్రిల్లో సిబ్బంది చోరీలు
పంటకు కాపలాగా ఉంటుందని వేసిన కంచే చేను మేస్తే ఎలా ఉంటుంది?. ఏపీలోని రెండు ప్రధాన ఆలయాల్లో జరిగిన ఘటనలు కూడా ఇలాగే ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో ఔట్ సోర్సింగ్ బ్యాంక్ ఉద్యోగి చోరీకి పాల్పడ్డాడు. స్వదేశీ, విదేశీ కరెన్సీని తస్కరించాడు. ఈ వ్యవహారం కొద్ది నెలలుగా సాగుతున్నట్లు సమాచారం. దీనిపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుణ్ని అరెస్ట్ చేశారు. 7వ తేదీన పరకామణిలో వేంకటేశ్వర ప్రసాద్ అనే ఉద్యోగి చోరీకి పాల్పడ్డాడు. వన్ టౌన్ సీఐ జగన్మోహన్ రెడ్డి విధులు ముగించుకొని వచ్చే సమయంలో రూ.20 వేల నగదు చోరికి పాల్పడగా భద్రతా సిబ్బంది గుర్తించారు.
విజయవాడలో..
కనక దుర్గమ్మ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. సోమవారం మహామండపంలోని 6వ అంతస్థులో అమ్మ వారి హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. ఆ సమయంలో బంగారం ఆభరణాలను అపహరించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. నల్లపూసల తాడు, ఉంగరం, 2 గిల్టు ఉంగరాలు, బుట్ట, దుద్దులు.. మహామండపం బాత్ రూంలో 2 కవర్లలో ఉన్నట్లు ఎస్పీఎఎఫ్ తనిఖీల్లో బయటపడింది. వాటి మొత్తం బరువు సుమారు 5 గ్రాములని, విలువు రూ.16 వేలని అధికారులు తేల్చారు. ఈ ఘటనపై అంతర్గతంగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.