Vijayasai Reddy: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై సవతి ప్రేమ చూపుతోంది: విజయసాయి రెడ్డి
Vijayasai Reddy Comments on Union Govt: రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఏపీ తరపున ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఇతర వైసీపీ ఎంపీలు కూడా హాజరయ్యారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు నాటి కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను 2014లో బీజేపీ ప్రభుత్వం నేరవేర్చుతామని చెప్పిందని ఆయన గుర్తు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు విభజన చట్టంలోని అన్ని అంశాలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరినట్టు ఎంపీ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విజయసాయి రెడ్డి విమర్శించారు. మరోవైపు విశాఖ రైల్వేజోన్, భోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల, జీఎస్టీ నష్టపరిహారం, కాలపరిమితి మరో ఐదేళ్లకు పెంచడం వంటి అంశాలను కూడా నేటి సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని విజయసాయి రెడ్డి వివరించారు. కానీ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పడంలేదన్నారు.