Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడు మండిపోతున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచే ప్రతామం చూపిస్తున్నాడు. 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓ వైపు ఎండ.. మరోవైపు ఉక్కపోత.. దీనికి తోడు వాడగాలులు కూడా వీస్తుండడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడు మండిపోతున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచే ప్రతాపం చూపిస్తున్నాడు. 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓ వైపు ఎండ.. మరోవైపు ఉక్కపోత.. దీనికి తోడు వడగాలులు కూడా వీస్తుండడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాలు బయట పెట్టాలంటేనే వణికిపోతున్నారు. కొద్దిరోజులుగా సాధారణంగా కంటే 2 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీనికి తోడు వాయవ్య భారత్ నుంచి వేడి గాలులు వీస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది.
సోమవారం ఉష్ణోగ్రతల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. పలు చోట్ల 45 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాలలో 45 డిగ్రీలు, కొండాపూర్లో 45.8 డిగ్రీలు, జన్నారంలో 45.8 డిగ్రీలు, బెల్లంపల్లిలో 45.4 డిగ్రీలు, నీల్వాయిలో 44.9 డిగ్రీలు, జిత్యాలలో 45.5 డిగ్రీలు, నల్లగొండలో 45 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లో 38 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 41 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనాలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఇక రానున్న వారం రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని పేర్కొంది. 45 నుంచి 48 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు జనాలు అప్రమత్తంగా ఉండాలని.. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకూడదని సూచించింది. ఎండ దెబ్బ వంటివి తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటిపోయింది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 46.05 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 45.98 డిగ్రీలు, ప్రకాశం జిల్లాలో 45.96 డిగ్రీలు, పల్నాడులో 45.79 డిగ్రీలు, ఏలూరులో 45.7 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లాలో 45.3 డిగ్రీలు, విజయవాడలో 44.21 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.