AP MLC Elections: ఉత్తరాంధ్ర తూర్పు రాయలసీమలో సైకిల్ జోరు
AP MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఏపీలో మూడు పట్టభద్రుల స్థానాలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ఈనెల 16వ తేదీన ప్రారంభం కాగా, పూర్తి స్థాయి ఫలితాలు వెలువడాల్సి ఉన్నది. అయితే, మూడు ప్రాంతాల్లోనూ సైకిల్ జోరుమీదున్నది. ఉత్తరాంధ్ర, తూర్పురాయలసీమలో టీడీపి బలపరిచిన అభ్యర్థులు ముందంజలో ఉండగా, పశ్చిమ రాయలసీమలో హోరాహోరీగా నువ్వానేనా అన్నట్లు అంకెలు ఉన్నాయి. పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన తరువాత వైసీపీ నేతలు, మంత్రులు తమదే విజయమని ధీమాను వ్యక్తం చేశారు. కానీ, ఆ నినాదం పనిచేయలేదని స్పష్టమైంది.
అదేవిధంగా గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన రాయలసీమలోనూ వైసీపీకి భంగపాటు తప్పలేదు. మొత్తం 9 జిల్లాల్లో 108 నియోజకవర్గాల పరిధిలో మూడు పట్టభద్రుల స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీ గెలుపు సాధించగా, పశ్చిమ రాయలసీమలో హోరాహోరీగా కౌంటింగ్ జరుగుతున్నది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుద్వారా విజయం సాధిస్తామని టీడీపీ చెబుతున్నది. వైసీపీ అధినేత, సీఎం జగన్ సొంత నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పడినట్లు సమాచారం. పులివెందులలో 7వ వేలకు పైగా ఓట్లు ఉండగా, నాలుగు వేలకు పైచిలుకు ఓట్లు టీడీకి పడినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు.