TDP vs YCP: రోడ్డెక్కిన టీడీపీ- వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వార్ !
TDP vs YCP Social Media War:గుంటూరుకు చెందిన కళ్ళం హరికృష్ణ రెడ్డి అనే వైసీపీ కార్యకర్త సోషల్ మీడియాలో సవాల్ చేసి అనంతపురం రాప్తాడు టీడీపీ కార్యాలయం దగ్గరకు వచ్చా అంటూ రెచ్చగొడుతూ చేసిన వీడియోలతో అనంతపురంలో ఉద్రిక్తత ఏర్పడింది. తాను అనంతపురం క్లాక్ టవర్ వద్దకు వస్తానని.. ఎవరైనా సరే అక్కడికి రావాలంటూ హరికృష్ణారెడ్డి అనే ఆ కార్యకర్త సోషల్ మీడియాలో పెట్టడంతో అనంతపురం క్లాక్ టవర్ దగ్గరకు టీడీపీ కార్యకర్తలు సైతం చేరుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ-వైసీపీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మా నేత గొప్ప అంటే మా నేత గొప్ప అంటూ సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకున్నారు. అతను నిజంగానే రాప్తాడు రావడం, వచ్చి రెచ్చగొట్టే వీడియోలు పెట్టడంతో విషయం తెలిసి పోలీసులు ఉలిక్కి పడ్డారు. వెంటనే క్లాక్ టవర్ వద్దకు చేరుకుని.. హరికృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి అక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వార్ గుంటూరు టు అనంతపురం రోడ్డు ఎక్కడం చర్చనీయాంశం అయింది.