Bachula Arjunudu: టీడీపీకి షాక్, సీనియర్ నేత బచ్చుల అర్జునుడు కన్నుమూత
TDP Senior leader Bachula Arjunudu Passed away
టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మరణించారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా విజయవాడలోకి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అర్జునుడు తుదిశ్వాస విడిచారు. గన్నవరం టీడీపీ నియోజకవర్గం ఇన్ చార్జ్ బచ్చుల అర్జునుడు మరణించడంతో గన్నవరం టీడీపీ నేతలు, కార్యకర్తలు షాక్ కు గురయ్యారు. దిగ్భాంత్రిని వ్యక్తం చేస్తున్నారు.
జనవరి 29న గుండెపోటు
గత 3 సంవత్సరాలనుండి గన్నవరం నియోజకవర్గం కి టీడీపీ ఇంచార్జిగా ఉన్న బచ్చుల అర్జునుడు జనవరి 29న గుండెపోటుకు గురయ్యారు. వెంటనే స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందించారు. ఆయనకు స్టంట్ అమర్చారు. ఆ తర్వాత ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.
గత 30 రోజుల నుండి విజయవాడ రమేష్ హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. ఈ రోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. బచ్చుల అర్జునుడు మరణించారని తెలియడంతో బంధువులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. భౌతిక కాయాన్ని అర్జునుడు స్వగ్రామం మచిలీ పట్నం తరలించనున్నారు.
కీలక నేతగా ఎదిగిన బచ్చుల అర్జునుడు
బచ్చుల అర్జునుడు 2014లో కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. 2017లో ఏపీ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2020లో టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నియమితుడయ్యారు. పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అధినేతకు దగ్గరయ్యారు.
తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీలోనే కొనసాగుతున్న బచ్చుల అర్జునుడు అనేక పదవులు చేపట్టారు. గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నారు. ఈ నెల 25 వరకు ఆయన పదవీకాలం ఉంది.