Lokesh Yuvagalam: పాదయాత్ర అనుమతిపై డైలమా.. లోకేశ్ తగ్గేదేలే..!
Lokesh Yuvaglam Yatra begins at Kuppam on 27 th January: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టదలచిన యువగళం పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఓవైపు రాష్ట్రంలో సభలు, ర్యాలీలకు అనుమతి లేదంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో నెం.1ను తీసుకురావడం, దానిని హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసినా.. ఈ నెల 23న తదుపరి విచారణ జరపనున్న నేపథ్యంలో ఎటువంటి తీర్పు వస్తుందన్నది ఉత్కంఠగానే ఉంది. మరోవైపు ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేసేందుకు లోకేశ్ చేసుకున్న దరఖాస్తుకు పోలీసుల నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. పాదయాత్ర చేస్తున్నట్ల సమాచారం ఇచ్చారే తప్ప.. తమ అనుమతి కోరలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉండగానే పోలీసుల ఆంక్షలతో సంబంధం లేకుండా పాదయాత్రకు లోకేశ్ సంసిద్ధమవుతున్నారు. కుప్పంలో భారీ బహిరంగ సభ నిర్వహించి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సభ కోసం కుప్పం – కమతమూరు రహదారిలో సుమారు 14 ఎకరాల ప్రైవేటు స్థలాన్నిఎంపిక చేశారు. వాహనాల పార్కింగ్ కోసం మరో 25 ఎకరాలు ఎంపిక చేశారు. సభకు 50 నుంచి 70 వేల మంది వస్తారని అంచనావేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం టీడీపీ నేతలు పూజలు చేసి ఏర్పాట్లు ప్రారంభించారు. యంత్రాలతో ముళ్ళ కంపలు తొలగిస్తున్నారు. రాత్రంతా భూమిని చదును చేసే పనులు కొనసాగాయి. పోలీసులు సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతామని టీడీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే ప్రారంభ సభ విషయంలోనే ఇలా ఉంటే.. రాష్ట్రం మొత్తం పాదయాత్ర ఎలా కొనసాగుతుందన్న ఉత్కంఠ ఆ పార్గీ వర్గాల్లో నెలకొ్ంది. పాదయాత్ర పొడవునా వైసీపీ శ్రేణుల నుంచి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి? పోలీసులు ఎంతమేరకు సహకరిస్తారు? అన్నవి ప్రధాన సమస్యలుగా మారాయి. ఇప్పటికే టీడీపీ-వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో పాదయాత్రలో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా ఎదుర్కొనేలా పార్టీ నేతలు కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నారు.
ఇందులో భాగంగా.. యాత్రలో లోకేశ్ వెంట ఎప్పుడూ వెయ్యి మంది ఉండేలా చూసుకోనున్నారు. ఒక్కో డివిజన్‌కు ఒక్కో రకమైన డ్రెస్ కోడ్ ను నిర్ణయించారు. పాదయాత్రను పట్టణ, నగర ప్రాంతాల్లో కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లోనే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తిగా రూరల్ ప్రాంతాలతో రూట్ మ్యాప్ రూపొందించారు. ఇక పాదయాత్ర విశేషాలను ఎప్పటికప్పడు ప్రజలకు అందించేందుకు మీడియా పరంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాను కూడా వినియోగించుకోనున్నారు. సోషల్ మీడియాను టీంలు మూడు గ్రూపులుగా ఏర్పాటు చేసి పాదయాత్రలో తమ వెంట తిప్పుకోనున్నారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణుల నుంచి సమస్య తలెత్తినా, పాదయాత్రను అడ్డకున్నా, స్థానికంగా ఏదైనా ఘర్షణ చోటుచేసుకున్నా.. దానిని వెంటనే సోషల్ మీడియాలొ సర్క్యూలేట్ చేసేలా బాధ్యతలు అప్పగిస్తున్నారు. పాదయాత్ర జరిగే ప్రాంతంలో స్థానికంగా ఉంటే సోషల్ మీడియా యూ ట్యూబ్ చానళ్లతోనూ సమన్వయం చేసుకుంటూ క్షేత్ర స్థాయికి యాత్ర విశేషాలు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతోపాటు జాతీయ స్థాయలోనూ లోకేశ్ పాదయాత్రకు ప్రచారం పందాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం జాతీయ మీడియాలో కవరేజ్ కి పాదయాత్రలో పీఆర్వోలనూ నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్ర సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.