Varupula Raja Death: విషాదంలో టీడీపీ నేతలు మొన్న బచ్చుల నేడు వరుపుల
Varupula Raja Death: తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన రోజునే నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై అయితే, 23 రోజులు చికిత్స పొందుతూ తారకరత్న మరణించారు. ఆతరువాత గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గన్నవరం ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో కన్నుమూశారు. తాజాగా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ నేత వరుపుల రాజా గత రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
ఐదేళ్లకిందట కూడా రాజా గుండెపోటుకు గురయ్యారు. అప్పట్లో వైద్యులు స్టంట్ వేశారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. శనివారం రాత్రి శనివారం రాత్రి గుండెపోటుకు గురికావడంతో కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో రాత్రి 11 గంటలకు రాజా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అనంతరం 12:10 గంటలకు రాజా భౌతికకాయాన్ని ప్రత్తిపాడుకు కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు తరలించారు. రాజా అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.
డీసీసీబీ చైర్మన్‌గా, ఆప్కాబ్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2019లో ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రాజా మృతితో టీడీపీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి విషయం తెలిసి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజా మృతి టీడీపీకి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.