YS Viveka Death Anniversary: వివేకా నాలుగవ వర్ధంతి…ఆ పార్టీ మాత్రమే తలుచుకుందేంటో?
YS Viveka Death Anniversary: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారు ఎవరికి వైఎస్ వివేకానంద రెడ్డి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి కడప జిల్లాలో అజాతశత్రువు అనే పేరు తెచ్చుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి రాముడైతే వివేకానంద రెడ్డి లక్ష్మణుడు అనేంతగా అన్ని విషయాలు చక్కబెట్టుకొచ్చేవారు. చాలా సౌమ్యుడిగా మెలుగుతూ అన్ని విషయాల్లోనూ అన్నకి తలలో నాలుకల వ్యవహరిస్తూ జిల్లాలో కూడా మంచి నేతగా పేరు తెచ్చుకున్నారు. అనవసరమైన మాట ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండే ఆయన తన సొంత ఇంట్లోనే దారుణమైన రీతిలో హత్యకు గురయ్యారు.
సరిగ్గా ఇదే రోజు 2019న ఆయన హత్యకు గురయ్యారు. అప్పటి సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా నెలరోజులు కూడా లేవు, ఆ సమయంలో ఆయన చనిపోవడం ఆ తరువాత ముందుగా ఆయన గుండెపోటుతో మరణించారని ప్రకటించడం, కాసేపటికి గుండెపోటు కాదు హత్య అనే అనుమానాలు వ్యక్తం కావడం హాట్ టాపిక్ గా మారింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ కేసు ఈ నాటికి ఏమాత్రం తేలడం లేదు. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే విషయం ఈరోజుకి ప్రశ్నార్ధకమే. అప్పట్లో చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన మరణం మీద ఒక సిట్ ఏర్పాటు చేశారు. తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక కొత్త సిట్ ఏర్పాటు చేసినా అది పెద్దగా ఉపయోగపడలేదు.
ప్రస్తుతానికి ఈ కేసు సీబీఐకి అప్పగించడంతో సీబీఐ శర వేగంగా విచారణ జరపుతోంది. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి కూడా హస్త ముందేమో అనే ఉద్దేశంతో ఆయన మీద కూడా విచారణ జరుగుతుంది. ఇప్పటికే రెండు మూడు సార్లు విచారణ జరిగింది, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి మీద కూడా విచారణ జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకూడదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసులో హైకోర్టు ఒక తీర్పును కూడా రిజర్వ్ చేసింది. ఈ హైకోర్టు తీర్పు వెలువడ్డాక ఈ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఈరోజు తన తండ్రి మరణం నేపద్యంలో ఆయన కుమార్తె సునీత మీడియాతో మాట్లాడారు. తన తండ్రి మరణానికి న్యాయం చేకూర్చాలని కోరారు.
అయితే ఇదిలా ఉంచితే ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీ మాత్రం గట్టిగానే వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి విషయంలో తమ రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి మృతికి న్యాయం జరగాలి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్లు సృష్టించింది. వైఎస్ వివేకా రెడ్డి మరణానికి కారణం ఏమిటో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసని, కానీ రాజకీయం కోసమే ఆ విషయాన్ని తొక్కి పెట్టి అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ నారా చంద్రబాబునాయుడు మీద బురదల్లే ప్రయత్నం చేశారని అంటున్నారు. దీంతో టీడీపీ మాత్రమే వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి విషయాన్ని కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేసింది వైసీపీ మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని పాటించింది.