TDP Alliance with Left Parties for MLC Elections: వామపక్షాలతో టీడీపీ పొత్తు… ఎమ్మెల్సీ ఎన్నికల విజయంపై చంద్రబాబు వ్యూహం
TDP Alliance with Left Parties for MLC Elections: రాష్ట్రంలో మూడు పట్టభద్రుల స్థానాలకు, రెండు ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ చూస్తున్నది. ఇందులో భాగంగా వామపక్షాలతో కలిసి అడుగులు వేయాలని నిర్ణయించింది. టీడీపీ పట్టభద్రుల స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయకుండా వామపక్షాల అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రాధాన్యత ఓట్ల క్రమంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి ద్వితీయ ఓట్ల ఆధారంగా పొత్తులు ఖరారు కానున్నాయి. ఈనెల 23వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు రోజుల్లో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.
మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికార వైసీపీకి చెక్ పెట్టాలని చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. వామపక్షాలతో పొత్తు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పట్టభద్రుల స్థానాల్లో విజయం సాధించాలని చూస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు వామపక్షాల అనుబంధ సంఘాలు పోటీ చేయనున్నాయి. ఇక ఇదిలా ఉంటే, టీడీపీ జనసేన పార్టీ మధ్య దాదాపుగా పొత్తులు ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ వామపక్షాలతో పొత్తులు పెట్టుకోవడంపై ఆ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడం లేదు. కానీ, అధికార పార్టీని ఓడించేందుకు జనసేన పట్టభద్రులు ఓటు వేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.